Gazette: సెప్టెంబర్​ 17 హైదరాబాద్​ లిబరేషన్​ డే

Union govt notifies to celebrate Sept 17 as 'Hyderabad Liberation Day

Mar 13, 2024 - 14:11
 0
Gazette: సెప్టెంబర్​ 17 హైదరాబాద్​ లిబరేషన్​ డే
  •  గెజిట్​ విడుదల చేసిన కేంద్రం
  •  అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం
  •  రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు స్పందన


నా తెలంగాణ, హైదరాబాద్​: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు సెప్టెంబర్​17న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాల్సిందేనని నిర్ణయించింది. ఏటా సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా స్పందిస్తూ..‘‘భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో కలిసింది. సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

ఫలించిన బీజేపీ పోరాటం

సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​ పాలనలో సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రతిపక్ష నేతగా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసిన కేసీఆర్​.. 2014లో తాను సీఎం అయ్యాక.. మజ్లిస్​ పార్టీతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ.. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదు. తెలంగాణ ప్రజలు ఇండిపెండెన్స్​ పొందిన రోజు విమోచన దినోత్సవం నిర్వహించాల్సిందేనని బీజేపీ నేతలు గత కొన్నేండ్లుగా పోరాడుతున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత కొన్నేండ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రం సెప్టెంబర్​ 17న విమోచన దినోత్సవంగా నిర్వహించాల్సిందేనని గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఈ వేడుకలు నిర్వహించాల్సిందే.

మోదీ సర్కారుకు ధన్యవాదాలు: కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్రం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేయడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి స్పందించారు. ‘‘1948 సెప్టెంబర్ 17న రజాకార్ల నుంచి తెలంగాణ స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించకుని ఏటా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం హర్షణీయం. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కింది. తర్వాతి తరాలకు సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి తెలిసేందుకు ఈ నిర్ణయం బాటలు వేస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు”అని తెలిపారు.