కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదనలు
చర్చలు, బందీల విడుదల, కాల్పుల విరమణ ఇరుదేశాలు కట్టుబడి ఉంటేనే యుద్ధ విరమణ సాధ్యం
వాషింగ్టన్: గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని రక్షణ శాఖ బృందం మూడు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో ముఖ్యంగా ఇజ్రాయెల్–హమాస్ చర్చలు, బందీల విడుదల, కాల్పుల విరమణ వంటి ముఖ్యమైన అంశాలను పొందుపరిచింది. శనివారం ఈ విషయాన్ని మీడియా వెల్లడించింది. తొలివిడతలో జరగనున్న చర్చలే అత్యంత ప్రాముఖ్యతను పోషిస్తాయని పేర్కొన్నారు. రెండో విడతలో ఇరువురు బందీల విడుదలకు ప్రాముఖ్యతనివ్వనున్నారని పేర్కొన్నారు.
అయితే అత్యంత ముఖ్యమైన కాల్పుల విరమణను తొలివిడత చర్చల నుంచి కొనసాగించాలని అమెరికా ఇజ్రాయెల్ కు సూచించినట్లు పేర్కొంది. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చర్చలు, బందీల విడుదల, కాల్పుల విరమణ వంటి అంశాల చర్చల కోసం రక్షణ శాఖకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు. కాగా ఇటీవలే తమ బందీలను వదిలే వరకూ చర్చలు,కాల్పుల విరమణ జరిపేది లేదని ఐడీఎఫ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన తాజా ప్రతిపాదనను ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగులుతోంది.
అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందాలను ఇరుదేశాలు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. అప్పుడే యుద్ధ విరమణ సాధ్యపడుతుందని పేర్కొంది.