ఉరిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

చొరబాట్లపై భద్రతాదళాలు అప్రమత్తం అమర్​ నాథ్​ యాత్రకు 24 కంపెనీల పారామిలటరీ బలగాల కేటాయింపు

Jun 22, 2024 - 18:26
 0
ఉరిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ ఉరి సెక్టార్​  సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతాదళాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పులు చోటు చేసుకోగా ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి నుంచే చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భద్రతాధికారులు తెలిపారు. వారి చర్యలను శనివారం విఫలం చేశామన్నారు. పలుమార్లు హెచ్చరించినా వారు వెనుదిరగకపోవడంతో కాల్పులు జరిపామన్నారు. మరింత మంది చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వారిని నిలువరించేందుకు ప్రత్యేక భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాగా ఉత్తర కాశ్మీర్​ లోని బారాముల్లా గోహ్లాన్​ ప్రాంతం నుంచి చొరబాట్లు జరుగుతున్నాయని గుర్తించామన్నారు. మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదుల గురించిన సమాచారం ప్రస్తుతం లేదన్నారు. వీరిద్దరు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. వీరి వద్ద ఆయుధాలు లభించాయని తెలిపారు. 

కాగా అమర్​ నాథ్​ యాత్ర ఈ నెల 29 నుంచి చేపట్టనుండగా ఈ యాత్ర జరిగే అన్ని ప్రాంతాలలో గతేడాది కంటే ఈసారి అదనంగా బలగాలను మోహరించారు. మొత్తం 24 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. గతేడాది 19 కంపెనీల పారామిలటరీ బలగాలను మాత్రమే మోహరించారు. ఈ అదనపు బలగాలు జనసమ్మర్థ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.