మాఫియా, రౌడీలకు జైలు, నరకం ఆ రెండు చోట్లే స్థానం
నైనిటాల్ ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
నైనిటాల్: మాఫియా, రౌడీలకు రెండుచోట్ల మాత్రమే స్థానం ఉన్నదని ఒకటి జైలు అయితే రెండోది నరకమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం నైనిటాల్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన బాల్యమంతా ఉత్తరాఖండ్ లోనే గడిచిందని అన్నారు. ఇక్కడ నివసించేటప్పుడు తాగునీటి కోసం కూడా చాలాదూరమే వెళ్లేవాడినని తెలిపారు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంటింటికి కుళాయి ద్వారా నీరు సరఫరా చేస్తోందన్నారు. మహిళలకు పొగ బారి నుంచి విముక్తి కల్పించిందన్నారు. మోదీ సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి బాధ కలుగుతోందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ముజఫర్ నగర్ అంటే కర్ఫ్యూ, కర్ఫ్యూ అంటే ముజఫర్ నగర్ అని గుర్తుకు వచ్చేవన్నారు. కానీ నేడు ఆ పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు. అసాంఘిక శక్తులకు ఆ ప్రాంతంలో చోటు లేదన్నారు. మాఫియా పాలనను ఈ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమి కొట్టామన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలినప్పుడు దేశ విభజన, ఉగ్రవాదం, నక్సలిజం, కులతత్వం, అవినీతి, వేర్పాటువాదం ఫరిడవిల్లేవన్నారు. వాటన్నింటినీ మోదీ హయాంలో తరిమి కొట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.