భోపాల్: మధ్యప్రదేశ్ లోని భారీ వర్షాలకు ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయం నాలుగో నెంబర్ గేట్ కుప్పకూలింది. శిథిలాల కింద పడి ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు గుజరాత్ లోని మలేశ్రీ నదిలో తమిళనాడుకు చెందిన యాత్రికుల బస్సు చిక్కుకుపోయింది. ఈ బస్సులో 29 మంది ఉన్నారు. స్పందించిన రెస్క్యూ బృందాలు 8గంటలపాటు తీవ్రంగా శ్రమించి యాత్రికులను సురక్షిత ప్రాంతానికి చేర్చాయి.
యూపీలో 10 నగరాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో సుల్తాన్ పూర్ రైల్వే ట్రాక్ పూర్తిగా నీటమునిగింది.
బీహార్‌లో గంగా, కోసి నదుల ఉధృతి పెరిగి కతిహార్‌లో వరదలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా 57 పాఠశాలలు మూతపడ్డాయి.
ఒడిశా పూరీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోణార్క్ సూర్య దేవాలయం ప్రాంగణం నీట మునిగింది. పూరీ జిల్లా యంత్రాంగం కూడా అన్ని పాఠశాలలను మూసివేసింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ లు జారీ చేసింది.