ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు చిన్నారులు మృతి
భద్రతా దళాలే లక్ష్యంగా పెట్టిన మందుపాతర వల్ల ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులు మృతిచెందారు.
బీజాపూర్: భద్రతా దళాలే లక్ష్యంగా పెట్టిన మందుపాతర వల్ల ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ బైరామ్ గఢ్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బోడ్గా గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఈ పేలుడు చోటు చేసుకోగా బాధిత బందువులు, గ్రామస్థులు మృతదేహాలను తీసుకొని బైరంగఢ్ కు రావడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అధికారుల సమాచారం ప్రకారం.. ఈ గ్రామ పరిధి కొద్ది దూరం అటవీ ప్రాంతంలో టెండు ఆకులను సేకరించేందుకు బొడ్గా గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఓయం(13), బోటి ఓయం(11)లు వెళ్లారు. మందుపాతర అమర్చిన విషయం తెలియక దానిపై కాలు పెట్టారు. ఒక్కసారిగా బాంబు పేలి పోయింది. దీంతో బాలురిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తమ వెంట తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ పేలుడుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు బైరంగఢ్ పోలీసులు తెలిపారు.
గతంలో కూడా ఈ గ్రామ పరిధిలో భద్రతా దళాలే లక్ష్యంగా పలుమార్లు ల్యాండ్ మైన్లు పెట్టినట్లు పలువురు చనిపోయినట్లు కేసులు నమోదైన సంఘటనలున్నాయని పోలీసులు తెలిపారు. పలుమార్లు ల్యాండ్ మైన్లను నిర్వీర్యం కూడా చేశామన్నారు.