తుక్డే తుక్డే గ్యాంగ్ కు వెన్నుదన్ను హస్తం
క్షమించాలా? శిక్షించాలా? నిర్ణయించాల్సింది ప్రజలే రాజస్థాన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ
జైపూర్: దేవాలయాలను కూల్చి భూములను స్వాధీనం చేసుకున్నారు. రామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్వారని కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర భగ్గుమన్నారు. ఆది నుంచి దేశానికి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం, పాపాలను క్షమించాలా? శిక్షించాలా అని ప్రధాని ప్రశ్నించారు. సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేస్తే ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌కు వెన్నుదన్నుగా నిలిచేది కాంగ్రెస్సేనని మోదీ మండిపడ్డారు.
రాజస్థాన్ లోని కరౌలీ ధోల్ పూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ శంఖనాద్ ర్యాలీలో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు.కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పజెప్పారని అన్నారు. కాంగ్రెస్ చరిత్రే కాదు భారత్ కు వారి ఉద్దేశాలు కూడా ప్రమాదకరమైన పరిస్థితులను కల్పించాయని అన్నారు. రామ మందిరానికి ధోల్ పూర్ రాళ్లతో నిర్మించారన్నారు. అదే రామ మందిరంపై హస్తం నేతలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని తెలిపారు. అంతేగాక రామ మందిర ప్రతిష్ఠను కూడా బహిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే అడుగుతారా? 370 తొలగిస్తే ఏం బాధ?..
కశ్మీర్ లో ఆర్టికల్ – 370 తొలగిస్తే కాంగ్రెస్, కూటమి పార్టీలకు ఏం బాధ అని ప్రశ్నించారు. కశ్మీర్ కోసం అనేక మంది రాజస్థాన్ బిడ్డలు ప్రాణాలర్పించారని ప్రధాని తెలిపారు. తాను చెప్పింది హస్తం నేతలకు కూడా చెప్పాలని, వీడియోను కూడా పంపించాలని ప్రధాని సూచించారు. కశ్మీర్ కోసం రాజస్థాన్ లోని ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను దమ్ముంటే అడగాలని తెలిపారు. ఎందరో పోరాట వీరుల గడ్డ రాజస్థాన్ అని కీర్తించారు.
జఠిలమైన సమస్యలనూ పరిష్కరించాం..
దేశంలోని జఠిలమైన సమస్యలకు కూడా పరిష్కార మార్గాన్ని వెతుకుతూనే ఉంటామని చేతులు ముడుచుకొని కూర్చునేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని నీటి సమస్యను తీర్చగలిగామన్నారు. ప్రతీ నిరుపేద ఇంటికి అమృతాన్ని అందించామని మోదీ స్పష్టం చేశారు. రానున్న సమయంలో కూడా ప్రతీ ఇంటికి నీరందించే కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. మోదీ విశ్రాంతి తీసుకునేందుకు, సరదాగా గడపడానికి పుట్టలేదన్నారు. సువిశాల భారత్ లో లక్ష్యాలు పెద్దవని వాటి పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతామని ప్రధాని స్పష్టం చేశారు.
3 కోట్ల మిలియనీర్ల సృష్టే లక్ష్యం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచిన ఈఆర్‌సీపీని కేవలం ఒకటిన్నర నెలల్లోనే భజన్‌లాల్ ప్రభుత్వం పూర్తి చేసిందని మోదీ పేర్కొన్నారు. కరౌలీ-ధోల్‌పూర్ ప్రజలు కూడా దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందారని స్పష్టం చేశారు. దేశంలో 3 కోట్ల మంది మిలియనీర్లను సృష్టించేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. ఇంతకుముందే ఈ పనులన్నీ గత ప్రభుత్వాలు చేస్తే తమ ప్రభుత్వానికి ఇన్ని సమస్యల పరిష్కారం తప్పి మరింత ముందుకు దేశాన్ని నడిపించే మార్గంలో వెళ్లేవారిమన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ఎన్నో వర్గాల వారు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ప్రకటించారు.
దళితులు, గిరిజనులు, మహిళల వెనుకబాటు తనానికి కాంగ్రెస్ కారణం..
దళితులు, గిరిజనులు, మహిళలకు కూడా కాంగ్రెస్ వెనుకబాటు తనానికి గురి చేసిందని ఆరోపించారు. 50 కోట్ల మంది నిరుపేదలకు జన్ ధన్ ఖాతాల ద్వారా అనుసంధానించామన్నారు. 11 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామన్నారు. 4 కోట్ల మందికి శాశ్వత ఇళ్లు అందజేశామని ప్రధాని మోదీ అన్నారు.
నూతన శకానికి నాందీ ఈ ఎన్నికలు..
ఈ ఎన్నికలు భారతదేశ అభివృద్ధికి, సంకల్పానికి నూతన శక్తిని ఇచ్చేలా తీర్పివ్వాలని మోదీ ప్రజలకు సూచించారు. ఎన్నో ఏళ్ల సమస్యలకు కూడా పరిష్కారాన్ని కనుగొన్నది బీజేపీయేనని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.