అభివృద్ధి, మానవాళికి శత్రువు ఉగ్రవాదం

Terrorism is the enemy of development and humanity

Jun 20, 2024 - 21:19
 0
అభివృద్ధి, మానవాళికి శత్రువు ఉగ్రవాదం
  • తగిన రీతిలో సమాధానం చెప్పాలి
  • చరిత్ర సృష్టిస్తుంటే వారికి కన్నుకుడుతోంది
  • రూ. 3300 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • జమ్మూకశ్మీర్​ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

శ్రీనగర్​: అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్న మానవత్వానికి శత్రువులను గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్​ అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడి శాంతిని భగ్నం చేయాలని వారు చూస్తున్నారన్నారు ఇలాంటి విద్రోహులకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదంతో ఏ దేశంలో అభివృద్ధి, శాంతి స్థాపన సాధ్యపడవన్నది తెలుసుకోవాలన్నారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే, శాంతి నెలకుంటుంటే నూతన చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంటే శత్రుదేశాలకు కన్నుకుడుతోందని  ప్రధాని మండి పడ్డారు. గురువారం రెండు రోజుల జమ్మూకశ్మీర్​ పర్యటనలో భాగంగా పర్యటించారు. రూ. 1500 కోట్లతో రోడ్డు, మౌలికసదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ. 1800 కోట్ల వ్యవసాయ అనుబధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం కశ్మీర్​ ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ సెంటర్​ లో ‘ఎంపవరింగ యూత్​, ట్రాన్స్​ ఫార్మింగ్​ జమ్మూకశ్మీర్​’ కార్యక్రమంలో ప్రసంగించారు.

విశ్వాసంతోనే మూడోసారి అధికారంలోకి..

కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధిపై విశ్వాసం, నమ్మకం ఉన్నందునే మూడోసారి కూడా తమకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో సుస్థిర అభివృద్ధిని సాధించి తీరుతామని ప్రధాని తెలిపారు. వాజ్​ పాయ్​ కలలు గన్న కశ్మీర్​ కోసం ప్రతీఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. మానవాళి క్షేమం, సంక్షేమం కోసం ఇక్కడి ప్రజలు పనిచేయాలని మోదీ సూచించారు. 

అభివృద్ధి చర్యలు సత్ఫలితాలు..

గత పదేళ్లలో ఇక్కడ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ప్రస్తుతం సత్ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. ప్రజలు వారి హక్కులను నిరభ్యంతరంగా పొందుతున్నారన్నారు. సబ్​ కా సాథ్​ సబ్​ కా వికాస్​ తో అందరం కలిసికట్టుగా దేశాభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. 

జీ–20 నిర్వహణతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి..

భారత రాజ్యాంగంలో దేశ హితం కోసం అనేక అంశాలు పొందుపరిచారని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆ రాజ్యాంగాన్నే కొందరు కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని ప్రతీఒక్క అంశాన్ని తాము గౌరవస్తామని, పాటిస్తామని, పూజిస్తామని మోదీ తెలిపారు. కశ్మీర్​ లోయలో జీ–20 నిర్వహణపై కూడా వారు సందేహాలను వ్యక్తం చేశారని తెలిపారు. కానీ తాము జీ–20ని ఇక్కడ నిర్వహించి ఈ ప్రాంత గౌరవాన్ని, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగలిగామని మోదీ అన్నారు. ఇప్పుడు కశ్మీర్​ లో టూరిజం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తోందన్నారు. దీనివల్ల ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందన్నారు. యోగి దినోత్సవాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించుకోవడం అదృష్టమన్నారు. ప్రపంచమంతా ఈ ప్రాంతాన్ని వీక్షించాలనే తమ ఉద్దేశ్యమని మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ఫలాలు ప్రతీఒక్కరికీ అందేలా చేయాలంటే సమిష్టి కృషి అవసరమన్నారు. జమ్మూకశ్మీర్​ ప్రజలు తమ నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని మోదీ అన్నారు. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని తెలిపారు. 

అభివృద్ధిలో వేగాన్ని పెంచుతాం..

రోడ్లు, వంతెనలు, రైళ్లు ఇలా రవాణాలో వేగాన్ని పెంచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని మోదీ తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిలో మరింత వేగం పుంజుకోనుందని తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యా, వైద్యం, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఇక్కడి యువత కోసం అనేక క్రీడా కార్యక్రమాలను కూడా ప్రారంభించామని, రూపుదిద్దామని తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందుతాయని తెలిపారు.