దడ పుట్టిస్తున్న ట్రంప్​ ప్రకటన

Trump's announcement that is causing palpitations

Dec 20, 2024 - 13:41
 0
దడ పుట్టిస్తున్న ట్రంప్​ ప్రకటన

చైనా, రష్యాలకు చుక్కలు
భారత్​ కు అందలం
కెనడా, మెక్సికోల్లో ఆర్థికమాంద్యం
స్థానిక కరెన్సీ లావాదేవీలకు అమెరికా బ్రేక్​?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న పెద్దన్న డోనాల్డ్​ ట్రంప్​ పదవీ ప్రమాణ స్వీకారానికి ముందే సంచలనాలకు కేరాఫ్​ గా మారుతున్నారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్రకటన చేయడం కెనడా, చైనా భారత్​ పలు దేశాలకు దడపుట్టిస్తోంది. ఆయన ప్రకటనతో సొంత ద్రవ్యం ద్వారా వ్యాపార, వాణిజ్యాలు నిర్వహిస్తున్న దేశాల షేర్​ మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. మరోవైపు డాలర్​ పెట్టుబడులను ఆయా దేశాలు ట్రంప్​ ప్రకటనను సమర్థిస్తూ ఉపసంహరించుకోవడమో, తటస్థంగా ఉండడమో చేస్తున్నాయి. 

యూపీఐ లావాదేవీల్లో భారత్​ కీ రోల్​ ..
కాగా ట్రంప్​ ప్రకటనపై రష్యా, చైనాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనవైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్​ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే భారత్​ పలుదేశాలతో యూపీఐ లావాదేవీలను పెద్ద యెత్తున నిర్వహిస్తూ డాలర్​ ప్రాబల్యాన్ని తగ్గించడంలో కీ రోల్​ పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్​ ప్రకటన భారత్​ కు కూడా కత్తిమీద సాములాగానే మారింది. ఏ దేశమైనా అమెరికా ఉత్పత్తులపై పన్నులు ఏ మేరకు విధిస్తుందో తాము అదే మేరకు పన్నుల భారం మోపుతామని ట్రంప్​ కుండబద్ధలు కొట్టారు. చైనా, ఐరోపాదేశాలు, కెనడా, రష్​యా, మెక్సికో, భారత్​, ఆసియా లాంటి దేశాలు అమెరికాతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో కీలకంగా ఉన్నాయి. అదే సమయంలో ఈ దేశాల మధ్య జరిగే వ్యాపార, వాణిజ్యాలను మాత్రం డాలర్​ రూపంలో గాకుండా స్వంత కరెన్సీ ద్వారా నిర్వహించుకుంటున్నాయి. దీంతో అమెరికా డాలర్​ ప్రాబల్యానికి భవిష్యత్తులో గడ్డుకాలం ఎదురుకానుందనేది స్పష్టమవుతుంది. దీన్నే అమెరికా వ్యతిరేకిస్తూ ట్రంప్​ ప్రకటనకు కారణమైంది. 

చైనాపై 60 శాతం సుంకమా?..
ట్రంప్​ పదవీ ప్రమాణ స్వీకారం తరువాత చైనాపై 60 శాతం సుంకాలు పెంచే అవకాశం ఉంది.అదే సమయంలో ఫెంటానికల్​ అనే మాదక ద్రవ్య సరఫరాను ఆపకుంటే మరో 10 శాతం సుంకం ఎక్కువ విధిస్తానని ప్రకటించారు. ట్రంప్​ తన తొలి పదవీ కాలంలో చైనాపై 25 శాతం పన్ను విధించారు. ట్రంప్​ ప్రకటనపై జీజిన్​ పింగ్​ మాట్లాడుతూ.. చైనా ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రంప్​ ప్రకటనపై ట్రూడో బేలచూపులు..
కెనడా, మెక్సికోలపై 25 శాతం పన్ను ప్రకటనతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే ప్రభావం చూపడం మొదలెట్టాయి. ఆ దేశాల ఆర్థిక స్థితి క్రమేణా అగాథంలోకి జారిపోతుంది. ఈ పరిణామాలు కాస్త కెనడా డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియనా ఫ్​రీలాండ్​ కూడా రాజీనామాకు కారణమయ్యాయి. ఇక ట్రంప్​ ప్రకటనతో ట్రూడో భవితవ్యం కూడా ప్రమాదంలో పడింది. కెనడా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. భారత్​ తో విభేదాలతో జస్టిన్​ ట్రూడో ప్రతిష్ఠ కాస్త ప్రపంచదేశాల్లో మసకబారింది. అప్పటి నుంచి ట్రంప్​ బెదిరింపులతో పూర్తిగా దిగజారిపోయింది. దీంతో ఆయన రాజీనామా తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. 

మన ఎగుమతులే ఎక్కువ..
ప్రస్తుతానికైతే ట్రంప్​ ప్రకటన భారత్​ ను ఆందోళన కలిగిస్తున్నా ప్రధాని మోదీ చర్యలు అమెరికా ప్రిఫరెన్షియల్​ ట్రేడ్​ అగ్రిమెంట్​ నుంచి భారత్​ కు మినహాయింపు లభించింది. ఇది శుభపరిణామంగా భావించొచ్చు. అదే సమయంలో ట్రంప్​ ప్రమాణ స్వీకారం తరువాత ఈ అగ్రిమెంట్​ ను సవరిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బాదం, యాపిల్స్​, ఆటోమొబైల్, టెక్స్​ టైల్​, ఫార్మాస్యూటికల్​ వంటి రంగాలపై ట్రంప్​ ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్​ అమెరికాల మధ్య స్నేహబంధం యథాతథంగా కొనసాగుతుంది. చైనా, రష్యాలపైనే ట్రంప్​ ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్​ కు ట్రంప్​ నుంచి పెద్ద మినహాయింపు లభించనుందా? లేదా? అనేది భవిష్యత్​ లో తేలనుంది. 2023–24 వాణిజ్య డేటా ప్రకారం అమెరికా నుంచి భారత్​ కు 42.2 బిలియన్​ డాలర్ల దిగుమతులు ఉండగా, భారత్​ నుంచి అమెరికాకు 77.52 బిలియన్​ డాలర్ల ఎగుమతులున్నాయి. ఇదే అమెరికా (ట్రంప్​)కు కంటగింపుగా మారింది. 

ప్రత్యామ్నాయ దేశంగా భారత్​ కే అవకాశం..
ఏది ఏమైనా ఒక మరోవిధంగా చెప్పాలంటే ట్రంప్​ సుంకాల ప్రకటన భారత్​ కు మేలు చేయనుంది. చైనాపై అమెరికా సుంకాలు పెంచితే ఆ దేశ ఎగుమతులు భారీగా తగ్గుతాయి. ప్రత్యామ్నాయంగా భారత్​ అమెరికా ఎగుమతుల్లో పెరుగుదల చోటు చేసుకునే అవకాశ ఉంది. దీంతో భారత పరిశ్రమ, ఉత్పత్తి రంగాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.