ట్రూడో దుర్భుద్ధి.. మసకబారుతున్న ప్రతిష్ఠ

దారిమళ్లించేందుకే భారత్​ పై ఆరోపణలు

Oct 16, 2024 - 15:45
 0
ట్రూడో దుర్భుద్ధి.. మసకబారుతున్న ప్రతిష్ఠ
సొంతపార్టీలోనే విభేదాలు
సర్వేలతో ట్రూడోకు చుక్కలు
కెనడా రాజకీయాల్లో పాక్​ ముఖ్య పాత్ర 
సెక్యూరిటీ అధికారి వెనెస్సా లాయిడ్​
ఖలిస్థానీలకు పాక్​ మద్ధతు!
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఓ వైపు సమీపిస్తున్న ఎన్నికలు.. మరోవైపు కెనడాలో ట్రూడో పార్టీకి మసకబారుతున్న పరువు.. ఇంకోవైపు ఓటు బ్యాంకు రాజకీయాలు.. వీటన్నింటినీ సమర్థవంతంగా వినియోగించుకొని భారత్​ ను ఊబిలోకి నెట్టి లబ్ధిపొందాలనే కుటిలయత్నానికి ట్రూడో తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్​ తో కయ్యానికి కాలుదువ్వడాన్ని సొంతపార్టీ (లిబరల్​ పార్టీ ఆఫ్​ కెనడా) నాయకులే ట్రూడోతో తీవ్రంగా విభేధిస్తున్నారు. తెలివిగా ప్రజాదృష్టిని మళ్లిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్​ లో ఉగ్రవాదులుగా ముద్రపడ్డ పంజాబ్​ లోని పలు సంస్థలన్నీ కెనడా నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహాస్యమే.  కాగా ఎన్నికలకు ఒక యేడాది ముందే ట్రూడో ఈ విధంగా పాల్పడుతుండడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
 
7.70 లక్షల మంది ఉన్న సిక్కు పార్టీల మద్ధతు కూడగట్టుకునేందుకు ట్రూడో ప్రభుత్వం పాక్​, ఖలిస్థానీలతో కలిసి భారత్​ పై విష ప్రచారానికి తెరలేపింది. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో కెనడా జాతీయులలో ఆయనపై మక్కువ లేదని పలు అంతర్గత సర్వేల ద్వారా తేటతెల్లం అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త గేమ్​ కు తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ దిశగా ప్రజల ఆలోచనలను మళ్లించినట్లయితే తాను ఏమీ తక్కువ తినలేదని కెనడా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని తన ఢంకా తానే మోగించుకోవచ్చనే దుర్బుద్ధితోనే నిజ్జర్​ హత్య ఆరోపణలను లేవనెత్తుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం కెనడా సెక్యూరిటీ ఇంటలిజెన్స్​ సర్వీస్​ డైరెక్టర్​ వెనెస్సా లాయిడ్​ కెనడా రాజకీయాల్లో పాక్​ ముఖ్​య పాత్ర పోషిస్తుందని బహిరంగంగానే అంగీకరించారు. అదే సమయంలో ఖలిస్థానీలకు కూడా పాక్​ మద్ధతు ఇస్తుందన్నారు. 
 
ఈ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ట్రూడో దుర్భుద్ధి వెనుక అసలు కారణం తేటతెల్లం అవుతుంది. పాక్​ తో చేతులు కలిపి కెనడా ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే అపవాదును మూటగట్టుకొనే అంశాన్ని పక్కకు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో పాక్​ ఆలోచనా విధానాన్ని కెనడా ట్రూడో అందిపుచ్చుకుంటున్నారు. ఉగ్రవాదం అనే ఉచ్చులో పాక్​ చిక్కుకున్నట్లుగా కెనడా చిక్కుకోదనడంలో గ్యారంటీ లేదు. ఈ రోజు భారత్​ కు మోస్ట్​ వాంటెడ్​ గా ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపును ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో వెనకేసుకొస్తే రేపు జరగబోయే పరిణామాలకు కూడా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
 
ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలోనూ ఈ ఉగ్రవాద గ్రూపు చేసిన ఆగడాలను, దాడులను వివరిస్తూ భారత్​ అనేక చర్యలు తీసుకున్నా కెనడా మాత్రం సహకరించలేదు. పైగా ఉగ్రవాద గ్రూపులకు సహకరిస్తూ వారిని వెనకేసుకొస్తూ భారత ఉన్నతాధికారులే హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇది ఇరుదేశాల సంబంధాలను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. 
 
అమెరికా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్​, బ్రిటన్​ లతోనూ తన దర్యాప్తు వివరాలను పంచుకుంది. అయితే ఈ దేశాలు ఇరుదేశాలు దర్యాప్తులో ఒకరికొరు సహకరించుకుంటూ సంయుక్తంగా ముందుకు వెళితేనే సమస్యకు పరిష్కారం లభించగలదన్నారు.