చొరబాట్లు ఆగితేనే శాంతి
అధికారంలోకొస్తే అడ్డుకట్ట వేస్తాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాట్లు ఆగినప్పుడు ఇక్కడ శాంతి నెలకొంటుందని, 2026లో రాష్ర్టంలో అధికారంలోకి వస్తే చొరబాట్లను పూర్తిగా అడ్డుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కోల్ కతాలోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గోగేట్ ను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ టీఎంసీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి, చొరబాట్లు, మహిళలపై దాడులు, హిందువులపై దాడులు, రౌడీలు, గుండాల పాలనను టీఎంసీ మమత సర్కార్ కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే సరిహద్దుల్లో చట్టవిరుద్ధమైన మార్గాలను మూసివేస్తామని అన్నారు. టీఎంసీ చర్యలు రాష్ర్ట శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పోర్టు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడమే గాకుండా రవాణాకు శక్తివంతమైన మాధ్యమమని మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ సంస్కృతిక బంధాలు కూడా బలోపేతం అవుతాయని షా వివరించారు.