స్థానిక కరెన్సీతో వ్యాపారం డోనాల్డ్​ ట్రంప్​ కు దడ

Trade with local currency is a blow to Donald Trump

Dec 2, 2024 - 15:09
 0
స్థానిక కరెన్సీతో వ్యాపారం డోనాల్డ్​ ట్రంప్​ కు దడ

స్విఫ్ట్​ నెట్​ వర్క్​ ద్వారానే నిర్వహించాలని పరోక్ష హెచ్చరికలు
బ్రిక్స్​ దేశాల కరెన్సీతో వ్యాపారం నిర్వహిస్తే వందశాతం సుంకం
ట్రంప్​ నిర్ణయంతో బ్రిక్స్​ స్థానిక కరెన్సీ రూపకల్పనకు అవరోధాలు
ఉపద్రవాలను ఎదుర్కొన్న భారత్​ నిర్ణయం ఎటువైపో?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: స్విఫ్ట్​ నెట్​ వర్క్​ ద్వారా డాలర్లలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థికంగా బలపడుతున్న అమెరికా (ట్రంప్​)కు బ్రిక్స్​ దేశాలు నిర్వహిస్తున్న స్థానిక కరెన్సీ వ్యాపారం దడపుట్టించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్​ డాలర్​ ముప్పుపై బ్రిక్స్​ దేశాలను హెచ్చరించినట్లయ్యింది. వ్యాపార, వాణిజ్య సంబంధిత లావాదేవీలను భారత్​, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలు మరిన్ని చిన్నదేశాలతో కలిసి స్థానిక కరెన్సీలోనే నిర్వహిస్తున్నాయి. ఇది కాస్త భవిష్యత్​ లో అమెరికాకు పెను నష్​టం వాటిల్లేలా చేయనుంది. ఇదే అంశాన్ని గ్రహించిన ట్రంప్​ బ్రిక్స్​ దేశాల కరెన్సీపై వంద శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా ఆయా దేశాలు అమెరికాతో వ్యాపారం చేయలేవని చెప్పకనే చెప్పారు. వందకు వందశాతం పన్ను వేస్తే అమెరికాతో నిర్వహించే వ్యాపార వాణిజ్యాలు మానుకోవాలని చెప్పినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

డాలర్​ కు నో గ్యారంటీ భయం?..
మొత్తానికి ప్రధాని మోదీ, బ్రిక్స్​ దేశాల దెబ్బకు ట్రంప్​ జడుసుకున్నారు. కాలక్రమేణా అన్నిదేశాలు ఇదేనీతిని పాటిస్తే తమ డాలర్​ ను పట్టించుకునేనాథుడే కరవై అమెరికా ఆర్థిక బంధనంలో చిక్కుకోవడం గ్యారంటీ అని గ్రహించాడు. అందుకే వందశాతం సుంకాల ప్రకటన చేశారు. బ్రిక్స్​ దేశాలు చేస్తున్న ఈ ప్రయత్నంపై అమెరికా మౌనం వహించదని దీంతో స్పష్టమవుతుంది. యూఎస్​ స్థానంలో కొత్త కరెన్సీని సృష్టించవద్దని, డాలర్​ తోనే వ్యాపార, వాణిజ్యాలు కొనసాగాలని తమకు గ్యారంటీ అవసరమని కూడా ట్రంప్​ అన్నారు. 

బ్రిక్స్​ దేశాలకు ట్రంప్​ ప్రకటన ఆశనిపాతమేనా?!..
2024లో బ్రిక్స్​ శిఖరాగ్ర సమావేశం రష్యా  కజాన్​ లో జరిగింది. ఈ సమావేశంలో స్వంత చెల్లింపుల వ్యవస్థ సృష్టిపైనే ప్రధానంగా అన్ని దేశాలు చర్చించాయి. వచ్చే యేడాది చివరి నాటికి డాలర్​ కు బదులు స్థానిక కరెన్సీ ద్వారానే చెల్లింపులు చేయాలన్న ప్రణాళికలకు అంకురార్పణ చేస్తూ ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పనిలో పడ్డాయి. దీంతో అమెరికా డాలర్​ ద్వారా వ్యాపార, వాణిజ్యాలు తగ్గనున్నాయి. ఇప్పటికే భారత్​ నాలుగడుగులు ముందుకువేసి యూపీఐ ద్వారా చైనా, రష్​యా, మాల్దీవులు, బంగ్లాదేశ్​, శ్రీలంక, నేపాల్​ లాంటి ఇత్యాధి దేశాలతో వ్యాపార, వాణిజ్యం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్​ ప్రకటన భారత్​ ను కూడా కలవర పెడుతుంది. ఈ ప్రకటన భారత్​ పాలిట శాపంలా పరిణమించే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో బ్రిక్స్​ దేశాలకు కూడా ఈ పరిణామం ఆశనిపాతంలా నిలవనుంది. ఈ సందర్భంలో బ్రిక్స్​ దేశాల నిర్ణయం కీలకం కానుంది. మరీ రష్యా లాంటి పెద్ద దేశంతో వ్యాపార, వాణిజ్యాలు నిలిపివేయాలన్న నిర్ణయాన్ని కూడా ప్రపంచదేశాలకు అర్థమయ్యే రీతిలో వివరించి భారత్​–రష్యాతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలిగిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మోదీ ఒప్పిస్తారా? ప్రత్యామ్నాయం వెతుకుతారా?..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ తో ఈ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఒప్పింప జేస్తారా? లేదా మరేదైనా ప్రత్యామ్నాయాన్ని శోధించగలుగుతారా? అన్నది ప్రస్తుతం భారత్​ ముందున్న అతిపెద్ద సవాల్​ గా నిలుస్తుంది. ఏది ఏమైనా అనేక ఉపద్రవాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాని మోదీ ట్రంప్​ డాలర్​ నిర్ణయాన్ని కూడా ఒప్పించడంలో సఫలమైతే ఇక భారత్ కు తిరుగులేనట్లేనని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 

స్విఫ్ట్​ చెల్లింపులు..
గ్లోబల్​ దేశాలతో వ్యాపారం చేయాలంటే అమెరికా డాలర్​ స్విఫ్ట్​ నెట్​ వర్క్​ తప్పనిసరి. ఈ వ్యవస్థ ద్వారా 1970ల నుంచి చెల్లింపులు చేస్తూ ప్రస్తుతం అత్యంత సురక్షితంగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా తమతో తాము వ్యాపారం చేసుకునేందుకు అమెరికా స్విఫ్ట్​ అనే నెట్​ వర్క్​ ను రూపొందించింది. దీంతో అమెరికాకు భారీ లాభం చేకూరుతుంది. 1973లో 22 దేశాలలో 518 బ్యాంకులలో ఈ నెట్​ వర్క్​ ద్వారా చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 200 దేశాలు, 11వేల బ్యాంకులు ఇదే పద్దతిలో విదేశీ వ్యాపారాలకు చెల్లింపులు చేస్తున్నాయి. ఈ బ్యాంకుల తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను అమెరికన్​ బ్యాంకులలో ఉంచుతాయి. దీని ద్వారా అమెరికా కొంతమొత్తం వడ్డీని కూడా పొందుతుంది. ప్రస్తుతం అమెరికా వద్ద ఇలా అందిన మొత్తమే 7.8 ట్రిలియన్​ డాలర్లు. ఈ డబ్బును అమెరికా తన ఎదుగుదలకు వినియోగిస్తుంది. ఒకవేళ స్విఫ్ట్​ ద్వారా కాకుండా స్థానిక కరెన్సీ ద్వారా బ్రిక్స్​ దేశాలు వ్యాపార వాణిజ్యాలను నిర్వహిస్తే అమెరికన్​ బ్యాంకుల్లో విదేశీ మార ద్రవ్య నిల్వలు భారీగా తగ్గుతాయి. ఫలితంగా అమెరికాకు వచ్చే వడ్డీలో తగ్గుదల ఏర్పడుతుంది. ఫలితంగా అమెరికా ఎదుగుదల సాధ్యపడదు. ఈ భయంతోనే ట్రంప్​ బ్రిక్స్​ దేశాలకు డైరెక్ట్​ వార్నింగ్​ ఇచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.