ఐదు రాష్ట్రాల్లో ఫెయింజల్​ బీభత్సం

Feinzal disaster in five states

Dec 2, 2024 - 14:31
 0
ఐదు రాష్ట్రాల్లో ఫెయింజల్​ బీభత్సం

తెలంగాణలో పది జిల్లాలకు హెచ్చరికలు
ఆంధ్ర, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడుల్లో కొనసాగుతున్న అలర్ట్​ 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఫెయింజల్​ తమిళనాడు తీరం దాటింది. అయినా తుపాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలపై ఉంది. 

తెలంగాణలోని పది జిల్లాల్లో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఎల్లో అలర్ట్​ జారీ చేశారు. జైశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాంలో ఈదురు గాలులు, భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు అలర్ట్​ జారీ చేశారు. కేరళలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయంలో భారీ వర్షం కురిసే ఎల్లో అలర్ట్​ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి ముక్కుజి-సత్రం అటవీ మార్గంలో కుమిలి నుంచి శబరిమల వరకు యాత్రికుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

కర్నాటక పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. బెంగళూరులో అలర్ట్​ జారీ చేశారు. చామరాజనగర్‌లో సోమవారం జరిగే  పరీక్షలన్నింటినీ రద్దు చేశార. డిగ్రీ కళాశాలలు మినహా పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.తమిళనాడు తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ జిల్లాల్లో తుపాను ప్రభావం కొనసాగనుందని ప్రకటించారు. కడలూరు, విల్లుపురం, కృష్ణగిరిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్తంగరై బస్టాండ్​ వద్ద రోడ్డుపై పార్కు చేసిన వాహనాలు సైతం భారీ వర్షానికి కొట్టుకొని పోయాయి. పుదుచ్చేరిలో 30 యేళ్ల రికార్డును ఈ వర్షం తిరగరాసిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 24 గంటల్లనే 49 సెంటీమీటర్ల వర్పాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్​ లోనూ ఫెయింజల్​ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.