రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్, కంకేర్ జిల్లాల సరిహద్దుమాద్లో నక్సల్స్, సెర్చింగ్ టీమ్ కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందినట్లు గా అధికారులు ప్రకటించారు. గురువారం ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల నుంచి పలు ఆయుధాలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతుండగా పలువురు మావోలు పరారైనట్లు అధికారులు గుర్తించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వివరించారు. మాద్ లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్ వేర్వేరుగా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ తెలిపారు.