నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలో మహిళా సంఘాల పనితీరు బాగుందని, వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతున్న తీరు బాగుందని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిఈఓ దివ్యదేవరాజన్ కితాబిచ్చారు.
బుధవారం కేశంపేట మండల కేంద్రంలోని తూలవానిగడ్డ గ్రామంలోని స్వాతి మహిళా సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. మహిళా సంఘాల ద్వారా బ్యాంకులలో రుణాలు తీసుకొని వాటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి మానసిక వికలాంగుల పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై సెంటర్ పనితీరు, నిర్వహణ, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
పిల్లల తల్లిదండ్రులు ఆటో ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సీఈఓ దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానని తెలిపారు. అనంతరం మండల మహిళా సమాఖ్య కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. భూతల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, వ్యవసాయ అద్దె పరికరాల కేంద్రం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాలలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీఏ పీడీ శ్రీలత, డీపీఎంలు బాలరాజు, స్వర్ణలత, నరసింహ, రవిచంద్ర కుమార్ రెడ్డి, ఏపీఎం భగవంత్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.