మాసిపోని రంగుల కళ

The productive decade of Vincent van Gogh

Apr 4, 2024 - 15:51
 0
మాసిపోని రంగుల కళ

ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన కృషికి ఫలితాలు వెంట వెంటనే పొంది జీవితాన్ని సంతృప్తిగా గడిపాను అన్న భావన కలగొచ్చు.  మరికొంత మందికి జీవితకాలం కష్టాలు, కన్నీళ్ల మధ్యనే గడిచి అసంతృప్తిగా జీవితం ముగియవచ్చు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వ్యాన్గో. విత్తు తాను మరణిస్తూ చెట్టుకు వాగ్దానం చేసినట్లు, వ్యాంగో మరణిస్తూ కళాఖండాలను వాగ్దానం చేసి వెళ్లాడు. కీర్తి కిరీటాల కోసం వెంపర్లాడలేదు. ధనం కూడబెట్టాలని కలలు కనలేదు. కానీ కుంచెతో తాను కలిపిన ‘రంగులు’ ఖండాలు దాటి ప్రపంచ కాన్వాస్ పై గొప్పగా పరుచుకున్నాయి.

ప్రకృతికి రంగుల వ్యాఖ్యానాలే వ్యాన్గో..

జీవిత చరమాంకం వరకు ఒక్క తమ్ముని ప్రేమ తప్ప ఎవరి ఆదరణనీ పొందక, పిచ్చివాడిగా ముద్రపడి పిచ్చాసుపత్రిలో నరకం అనుభవించి, బతికిన 37 ఏండ్లు నరకంలో బతికినట్లే బతికి తనువు చాలించాడు వ్యాన్గో. బతికిన ముప్పై ఏడేండ్లలో ఇరవై ఏండ్ల తర్వాతనే కుంచె పట్టి చిత్రాలు వేయడం ఆరంభించిన ఆయన పదహేడేండ్లు మాత్రమే చిత్రాలు వేశాడు. తను బతికున్నంత కాలం వేసిన దాదాపు వెయ్యి చిత్రాలలో ఒక్కదాన్ని తప్ప మిగిలినవి ఎవరూ కొనలేదు   ప్రశంసించనూ లేదు కూడా. ఎందుకంటే అవి ఆనాడు ఎవరికీ అర్థం కాలేదు. వాటి విలువా తెలియదు కాబట్టి. వ్యాన్గోను గొప్పగా అభిమానించిన తమ్ముడు థియో చేతిలో చెయ్యేసి కొన ఊపిరి వదిలాడు వ్యాన్గో. ఆయన మరణించిన కొన్నాళ్లకే థియో కూడా చనిపోయాడు. థియో భార్య, కొడుకు వ్యాన్గో చిత్రాలను ప్రపంచం ముందుకు ఒక్కొక్కటి తెచ్చి తిరిగి ఆయనను బతికించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 1853 మార్చి 30 న నెదర్లాండ్ లో జన్మించిన ఆయన1890 లో మరణించారు. కానీ ఆయన1890 నుంచే బతకడం ప్రారంభించారనుకోవాలి. 171 ఏండ్ల కిందట పుట్టి కేవలం మూడున్నర దశాబ్దాలే భూమిపై నడయాడి చివరి కొన్ని సంవత్సరాలు మాత్రమే చిత్రాలు వేసిన ఆయన్ను సమాజం ఇన్నాళ్లు గుర్తుంచుకుందంటే ఆయన జీవితం ఎంతో అర్థవంతమైందని గ్రహించాలి. సరుకుగా మారిన కళను ఈసడించుకున్నాడు వ్యాంగో. ‘విన్సెంట్ వ్యాన్గో కేవలం కళాకారుడు మాత్రమే అయ్యుంటే నేల నలుచెరగులకు చేరువయ్యేవాడు కాదేమో. అతన్ని ఇతర కళాకారులకు భిన్నోన్నతంగా నిలబెట్టింది అంతులేని వేదన, సాటి మనిషిపై అలవిగాని ప్రేమ’ అని విన్సెంట్ వ్యాన్గో జీవితంపై ఇర్వింగ్ స్టోన్ రాసిన ‘లస్ట్​ ఫర్​ లైఫ్​’ నవలను తెలుగులోకి ‘జీవన లాలస’ పేరుతో అనువదించిన పి.మోహన్ అంటారు పుస్తక ముందు మాటల్లో. ‘మనుషులను ప్రేమించడానికి మించిన కళాత్మకమైనదేదీ ఈ లోకంలో లేదంటారు విన్సెంట్ వ్యాన్గో. తన ఆత్మ బంధువుల్లాంటి సూర్యున్ని, పొద్దుతిరుగుడు పూలను, నక్షత్రాలను ప్రేమించినంత గాఢంగానే జనాల్ని, సామాన్య జనాల్ని వ్యాన్గో ప్రేమించాడని మోహన్ అంటారు. ‘ ఆ ప్రకృతికి, ఆ మమతలకు రంగుల వ్యాఖ్యానాలే వ్యాన్గో బొమ్మలు’ అంటూ నవల అనువాదన్ని ప్రారంభించారాయన.

తినడానికి తిండి లేక..

వ్యాన్గో తినడానికి తిండిలేక రూపాయి కోసం అర్రులు చాచాడు. తమ్ముడు థియో మాత్రమే అన్న అవసరాలను గ్రహించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వ్యాన్గో మరణానంతరం ఆయన వేసిన చిత్రాలకు మాత్రం మిలియన్ డాలర్ల డబ్బు వచ్చిపడింది. ఆయన వేసిన ఒక పెయింటింగ్1990 లో 83 మిలియన్ డాలర్లు పలికింది. ఇక పిచ్చివాడిగా ముద్రపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, తన గది కిటికీలోంచి పొలంలో శ్రామికుడు పడుతున్న కష్టాన్ని చిత్రించాడు. ఆ పెయింటింగ్ 2017 లో 81 బిలియన్ డాలర్లకు ఓ ధనవంతుడు సొంతం చేసుకున్నాడు. ప్రకృతికి, పీడిత ప్రజలకు వ్యాన్గోకు విడదీయలేని అనుబంధం ఉంది. ఇంత గొప్ప చిత్రకారుని గురించి నాకు తెలియదు.. ఎక్కడా చదివే అవకాశం కూడా కలగలేదు. వ్యాన్గోను కిరణ్ ప్రభ  తన టాక్ షో ద్వారా నాకు పరిచయం చేశారు. అది విని చలించిపోయాను. కొన్నాళ్ల వరకు ఎటు వెళ్లినా ఏం చేసినా ఆయన గురించి కిరణ్ ప్రభ చెప్పిన మాటలే గుర్తొచ్చేవి. ఆ తర్వాత ఒక సారి దర్శకుడు వంశీని కలిసినప్పుడు వ్యాన్గో ప్రస్తావన తెస్తే  బిగ్గరగా నవ్వేసి ఆయన గురించి అర్ధ గంట ఏకబికిన  చెప్పారు. అంతే కాదు పి.మోహన్ అనువదించిన ‘జీవన లాలస’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చి చదవమన్నారు. ఇలా వరుసగా వ్యాన్గో మత్తులో మునిగి తేలుతున్న నాకు మా అమ్మాయి సుమేధ నుంచి ఓ రోజు కబురు. ఫిబ్రవరిలో వ్యాన్గో కు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో షో జరుగుతోందని, అది వ్యాంగో పుట్టిన రోజుకు ఒక రోజు ముందు(29/03/2024) ప్రారంభమై ఈనెల పది వరకు ఉంటుందని సుమేధ వాట్సప్ లో మెసేజ్​ పెట్టింది.

ప్రదర్శన చూసి..

వ్యాన్గో అంటే ఇష్టం కదా నాన్న ఆ షోకు తప్పనిసరిగా వెళ్లమని హుకుం జారీచేసింది నా కూతురు. మా ఇంట్లో మా తమ్ముడు శ్రీరాంప్రసాద్ , మా అన్నయ్య కూతురు అర్చన , నా కూతురు సుమేధ, మనుమరాలు ఆనంది రంగుల్లో కుంచ ముంచిన వారే. నాకు కనీస ప్రవేశం లేదు కానీ చిత్రకారులన్నా, చిత్రాలన్నా అమితమైన అభిమానం. ఈ షోకు వెళ్లాం. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య మేము షో చూశాం. నూటా యాభై ఒక్క సంవత్సరాల కిందట ఏమీ ఆశించకుండా తనకున్న కళానైపుణ్యాన్ని కాన్వాస్ పై ప్రదర్శిస్తే, ఆ కళాఖండాలు నేడు మన ముందుకొచ్చి పలకరిస్తున్నాయంటే మామూలు విషయమా! అంత  గొప్ప చిత్రకారుడికి మనమిచ్చే నీరాజనం ఈ ప్రదర్శనను తిలకించి నాలుగు గోడలపై ప్రవహించిన ఆయన రంగుల ప్రపంచాన్ని మునివేళ్లతో తడిమి పరవశించడమే కదా !

– పి.వి.రావు
సీనియర్ జర్నలిస్ట్
 9010153065