మహాదేవ్ బెట్టింగ్ సౌరభ్ అరెస్ట్
Mahadev betting Saurabh arrested
దుబాయ్ లో ఇంటర్ పోల్ సక్సెస్
విదేశాంగశాఖ, హోమంత్రిత్వ శాఖ సహకారం
యాప్ తో వేల కోట్లు సంపాదన
నిర్వహణ వెనుక బడా రాజకీయ నాయకుల హస్తం
సినీ ప్రముఖులకు భారీ ముడుపులు
గుట్టు విప్పేందుకు భారత దర్యాప్తు సంస్థలు సిద్ధం
మరో 12 రోజుల్లో భారత్ కు నిందితుడు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ ఇంటర్ పోల్ సక్సెస్ సాధించింది. ఎట్టకేలకు తప్పించుకు తిరుగుతున్న మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన సూత్రధారి సౌరభ్ చంద్రకర్ ను యూఏఈలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దుబాయ్ నుంచి భారత్ తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన న్యాయప్రక్రియను మొదలు పెట్టారు. ఇతన్ని భారత్ తీసుకువచ్చేందుకు సుమారుగా 10 నుంచి 12 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటర్ పోల్ అధికారులు శుక్రవారం మీడియాకు సమాచారం ఇచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ, హోంమంత్రిత్వ శాఖ సహకారంతో ఈడీ అభ్యర్థన మేరకు ఈ ఆపరేషన్ ను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించి నిందితున్ని దుబాయ్ లోని ఒక హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. 2023లోనే దుబాయ్ పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నా భారత్ కు అప్పగించేందుకు పలు అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ యాప్ భాగస్వామ్యం, నిర్వహణలో సౌరభ్ చంద్రకర్ కు కొందరు రాజకీయ ప్రముఖులు కూడా సహకరించారు. అదే సమయంలో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా యాప్ ద్వారా బాగానే వెనకేసుకున్నారు. ఈ ఉదంతం గతంలో దుమారం రేపడం, పలువురు యాప్ ద్వారా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో కేంద్రం దర్యాప్తు చేపట్టింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. 2019లో ఒక సామాన్యుడిలా చిన్న జ్యూస్ షాప్ నడుపుకునే సౌరభ్ యాప్ ద్వారా వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఇందులో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా వాటా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఏది ఏమైనా అనేక ప్రయత్నాల తరువాత సౌరభ్ ను అరెస్టు చేయడంతో యాప్ నిర్వహణ గుట్టు వెనుక ఇంకా ఉన్న ప్రధాన సూత్రధారులెవ్వరనే విషయం త్వరలోనే తేలిపోనుండడంతో ఇతనికి సహకరించిన ప్రముఖ రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.