మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తి

28న బిహార్​నాలుగు స్థానాల నామినేషన్లు చివరి గడువు తొలి విడత ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ

Mar 27, 2024 - 18:24
 0
మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టానికి బుధవారంతో తెరపడింది. బిహార్​లో గురువారం నామినేషన్లకు గడువు ముగుస్తుంది. మొదటి విడతలో 17 రాష్ట్రాల్లో 102 స్థానాలకు లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. 

తమిళనాడులోని 39, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, అస్సాంలో 5, మహారాష్ట్రల్లో 5, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయలో 2, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానానికి నామినేషన్ల ఘట్టం సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.  బిహార్‌లో నాలుగు స్థానాలకు మాత్రం నామినేషన్లను మార్చి 28వరకు స్వీకరిస్తారు. బిహార్ మినహా మిగిలిన ప్రాంతాల్లో 28న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ కాగా ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

మొదటి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీయే  ఇప్పటికే ప్రచార దశలో ముందంజలో ఉంది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీయే తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో జోరుగా పాల్గొంటుండంతో ఆయా స్థానాల్లో బీజేపీ బలాన్ని మరింతగా పెంచుకుంటోంది. కాగా నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన తరువాత ప్రచారంలో మరింత వేగం పెంచనున్నట్లు కేంద్ర బీజేపీ నాయకులు తెలిపారు.