అవినీతి సొమ్మంతా పేద ప్రజలకే

రాజమాతా అమృతారాయ్​తో ఫోన్​లో ప్రధాని మోదీ

Mar 27, 2024 - 18:22
 0
అవినీతి సొమ్మంతా పేద ప్రజలకే

న్యూఢిల్లీ: అవినీతి సొమ్మంతా పేద ప్రజలకు అందజేస్తామని పశ్చిమ బెంగాల్​బీజేపీ అభ్యర్థి రాజమాతా అమృతా రాయ్​కి ప్రధాని తెలిపారు. బుధవారం ఉదయం బీజేపీ తరఫున పశ్చిమ బెంగాల్​ కృష్ణానగర్​లోక్​సభ స్థానం నుంచి పోటీలో ఉన్న రాజమాతాతో ప్రధాని మోదీ ఫోన్​లో మాట్లాడారు. అవినీతి పరుల నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు అందించే న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నామని మోదీ తెలిపారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇంకోవైపు అవినీతిపరులంతా ఏకమై తమతమను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అవి సఫలం కాకపోవడంతో ప్రజల మధ్య, దేశంలో వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్​లో మార్పు కోసం ప్రజలు ఈసారి ఓటు వేయనున్నారని స్పష్టం చేశారు. అమృతారాయ్​ నదియా జిల్లాలోని రాజ్​బరీ 39వ వారసుడు సౌమిష్​ చంద్రరాయ్​ భార్య. రాజకుటుంబం సేవల కారణంగా అందరూ ఆమెను రాజమాతాగా పిలుస్తారు. ఈ నెల 20న రాజమాతా బీజేపీలో చేరారు. చేరిన వెంటనే ఆమెకు ఎంపీ స్థానం ఖరారైంది. రాజమాతాకు పోటీగా కృష్ణానగర్​ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా ఉన్నారు. కాగా సేవాభావంతో ఎప్పుడు ప్రజల మదిలో ఉండే రాజమాతా కుటుంబం రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఇక్కడ మార్పు తథ్యమనే వాదన వినిపిస్తోంది. అమృతారాయ్​ గెలుపు సునాయాసమే అని ప్రజలు పేర్కొంటున్నారు.