రామాలయ మొదటి అంతస్థు పూర్తి

రెండో అంతస్థులో శరవేగంగా పనులు మీడియాతో ఆలయ ధర్మకర్త అనిల్​ మిశ్రా

Apr 28, 2024 - 18:29
 0
రామాలయ మొదటి అంతస్థు పూర్తి

అయోధ్య: రామ మందిర మొదటి అంతస్థులోని నిర్మాణాలు పూర్తిగా రూపుదిద్దుకున్నాయి. రెండో అంతస్థులోని స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆలయ కమిటీ ధర్మకర్త డాక్టర్​ అనిల్​ మిశ్రా ఆదివారం మీడియాతో పంచుకున్నారు. డిసెంబర్​ 2024 నాటికి రామాలయ పూర్తి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. కూలీల సంఖ్యను కూడా నిర్మాణ సంస్థ భారీగా పెంచిందని స్పష్టం చేశారు. 

మొదటి, రెండో అంతస్థుల పనులు ఏకకాలంలో నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. శిల్పకారుల కొరత ఉందన్నారు. ప్రస్తుతం మొదటి అంతస్థు పూర్తి అయిపోవడంతో ఇక్కడ పనిచేసిన శిల్పకళాకారులే రెండో అంతస్థులోనూ పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందువల్ల పనుల్లో వేగం పెరిగిందన్నారు. ఇప్పటివరకు 40 మంది కళాకారులు మాత్రమే విగ్రహాలకు చెక్కేవారని పేర్కొన్నారు. మరో 20 మంది కళాకారులను రంగంలోకి దింపామన్నారు. రామ దర్బార్​ రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు ప్రతిష్ఠించే ప్రదేశమే మహాపీఠమని వివరించారు. సప్తమండపం డిజైన్​ ను ఆర్కిటెక్ట్​ ఆశిష్​ సొంపురా అత్యంత సుందరంగా డిజైన్​ చేస్తున్నట్లు వివరించారు. 

మరోవైపు ఆలయ నిర్మాణంతోపాటు కుబేర్​ తిల సుందరీకరణ పనులు కూడా అతి త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. భద్రత, మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్ల అనంతరం భక్తులను అనుమతించనున్నామని తెలిపారు.