ఫలప్రదంగా చైనా–భారత్ చర్చలు భారత్ ఎప్పటికీ తలవంచదు
రాహుల్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన మంత్రి రాజ్ నాథ్ సింగ్
అహ్మాదాబాద్: చైనా–భారత్ మధ్య చర్చల ఫలప్రదంగా జరుగుతున్నాయని భారత్ ఎప్పుడూ తలవంచదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రాజ్ నాథ్ కౌంటరిచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అహ్మాదాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సైనిక దృక్కోణంలో భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించిందన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. చైనా విషయంలో కూడా ఇదే భావంతో ముందుకు వెళతామన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.21,000 కోట్ల మార్కును దాటిన భారత రక్షణ ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరుగుతాయని రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో రూ.600 కోట్ల విలువైన డిఫెన్స్ మెటీరియల్‌ని ఎగుమతి చేశామని, అయితే ఇప్పుడు ఈ సంఖ్య రూ.21,000 కోట్లు దాటిందని స్పష్టం చేశారు. అది మరింత పెరగబోతోందని అన్నారు.
క్షిపణులు, ఇతర ఆయుధాలు, బాంబులు లేదా ట్యాంకులు ఏవైనా రక్షణ వస్తువులు భారతీయులచే తయారు చేయబడేలా చూడడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే దేశీయ పరిశ్రమలకు ఊతం ఇస్తున్నామని స్పష్టం చేశారు. రక్షణ విభాగంలో కూడా మోదీ నిర్ణయం వల్ల స్వదేశీ ఉత్పత్తులు నేడు ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని గుర్తుంచుకోవాలని రాహుల్ కు చురకలంటించారు. రూ.లక్ష కోట్లకు పైగా రక్షణ ఉత్పత్తిని సాధించగలిగామని తెలిపారు. డిఫెన్స్ తయారీలో దేశం స్వావలంబనను పెంచాలనే ప్రభుత్వ ఉద్శంతో ఉన్నామని మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.