పఠాన్‌కోట్: పఠాన్‌కోట్‌లోని ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ గట్టుపై గురువారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధాలు రెండుకిలోమీటర్ల వరకు వినిపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆర్మీ స్టేషన్ సమీపంలోని కాలువ ఒడ్డున పేలుడు సంభవించడంతో జనాలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండే వీధి వ్యాపారులు రోజు తిష్ఠ వేసి కూర్చుంటున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు డీఎస్పీ సుమర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాలువ ఒడ్డున పేలుడుకు సంబంధించిన పలు ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా లభించిన ముక్కలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నట్లు వివరించారు. అనంతరమే పేలుడు దేనికి సంబంధించింది అనేది పూర్తి వివరాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. పేలుడు జరిగిన ప్రాంతం ఆర్మీ స్టేషన్ కు కేవలం 30 మీటర్ల దూరంలో ఉండడం విశేషం.