తాళి జోలికొస్తే తలలు నరికేస్తారు!
దేశం బాగుకోసం సంకోచించను పేపర్ లీక్ లో గెహ్లాట్ ప్రమేయం సన్నిహితుడే బయట పెట్టాడన్న ప్రధాని యువశక్తి నిర్వీర్యానికి హస్తం ప్రయత్నం ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ రిజర్వేషన్లపై వెనక నుంచి హస్తం కుట్ర ముస్లీంలీగ్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం మీకుందా? మేనిఫెస్టో అంతా వారి ముద్రే దేశవిచ్ఛినాన్ని కోరుకునే బ్రోకర్లంతా హంతకులే గత ప్రభుత్వాలకు ఆమ్యామ్యాలతో పబ్బం మోదీ హయాంలో గట్టి భద్రతా చర్యలు ఆగ్రా ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ
ఆగ్రా: భారత వీర వనితలు,తల్లులు సోదరీమణులు మంగళసూత్రం జోలికి ఎవరైనా వస్తే తలలు నరికివేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఆగ్రాలో ఎన్నికల ప్రచారం సందర్భగా ఫతేపూర్ సిక్రీలో జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి మోదీ తరఫున రాధే, రాధే అని చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తాను తన కుటుంబం బాగు కోసం వారి మద్దతు కోరేందుకు సంకోచించనన్నారు. దేశంలో యువత శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని మండిపడ్డారు. రాజస్థాన్ పేపర్ లీక్ లో గెహ్లాట్ ప్రభుత్వ ప్రమేయం ఉందని వారికి అత్యంత సన్నిహితుడే బయట పెట్టాడని మోదీ వివరించారు. దేశానికి ఇంతకంటే పెద్ద ద్రోహం ఏం ఉంటుందని ప్రశ్నించారు. యువత శక్తి సామర్థ్యాలను వీరు నశింప చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు కోట్ల మంది అక్కాచెల్లెమ్మలను, తల్లులను కోట్లాధికారులుగా, లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని పేర్కొన్నారు. తన దేశ యువత, మహిళలను చూసి తాను గర్వపడుతున్నానని మోదీ అన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వారి పనితీరు మెరుగ్గా ఉందన్నారు.
ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మత ప్రాతిపదికన దోచుకునేందుకు కాంగ్రెస్ భారీ కుట్రకు తెరలేపిందన్నారు. తాముండగా ఆ కుట్ర గోడలు బద్ధలు కొట్టందే ఊరికే కూర్చోమని స్పష్టం చేశారు. కర్ణాటకలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లను సమర్థిస్తారా అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఓబీసీలో వారిని చేర్చి తమ దేశవాసుల ప్రయోజనాలను తాకట్టుపెడతారా? అని మండిపడ్డారు. కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. వెనకనుంచి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కకర్ణాటకలోనూ కాదు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇదే కుయుక్తులకు సిద్ధపడుతోందని మండిపడ్డారు.
ముస్లింలీగ్ ల బుజ్జగింపులను తట్టుకునే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు లేవని అందుకే దేశ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలోనే వందశాతం ముస్లిం లీగ్ ముద్ర ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ విచ్ఛిన్నాన్ని కోరుకునే బ్రోకర్లంతా హంతుకులన్నారు. గత ప్రభుత్వాలకు లంచాలు ముట్టజెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పూర్తిగా సమాయత్తం అయ్యారన్నారు.కానీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం వచ్చాక వారి ఆటలు కొనసాగడం లేదన్నారు. భారత సైన్యానికి, ఇంటలిజెన్స్ కు పూర్తి స్వేచ్ఛను కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.