రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు

ఫిక్కీ రోడ్​ సేఫ్టీ సమావేశంలో మంత్రి నితిన్​ గడ్కరీ

Aug 28, 2024 - 18:39
Aug 28, 2024 - 18:40
 0
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఫిక్కీ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవార్డ్స్ కాంక్లేవ్ 2024 ఆరో ఎడిషన్ న్యూ ఢిల్లీలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హైపై ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకునేందుకు రోడ్డు తనిఖీలు చేస్తున్నామన్నారు. అదనంగా, అంబులెన్స్ వాహనాలు, సిబ్బంది ప్రమాద ప్రదేశాల నుంచి గాయపడిన వారిని సకాలంలో రక్షించేందుకు సాంకేతికతను పెంపొందించనున్నామని చెప్పారు. 
 
యేటా దేశంలో ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 1.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ప్రమాదాల నివారణకు తమవంతు కృషి చేస్తుందని, ప్రయాణికులు, వాహనదారులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రూల్స్ ఆఫ్ ది రోడ్ ఇనిషియేటివ్ కింద విద్యాసంస్థల్లో అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నట్లు గడ్కరీ తెలిపారు.
 
రోడ్డు భద్రత ఆడిట్‌కు పరిశ్రమ సంస్థలు, విద్యా సంస్థలతో సహా వాటాదారులు ముందుకు వచ్చి సహకరించాలని మంత్రి చెప్పారు. ఫిక్కీ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఈ సమావేశం నిర్వహించడం అభినందనీయమని నితిన్ గడ్కరీ కొనియాడారు.