యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధమే
The UP Madrasa Act is constitutional
హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
నాణ్యమైన విద్యకోసం ప్రభుత్వం నియంత్రణ చేపట్టొచ్చు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూపీ మదర్సా చట్టంపై సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధమేనని పేర్కొంది. మంగళవారం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మదర్సా తీర్పు పిటిషన్ పై విచారణ చేపట్టింది. మదర్సాలలో చదువుతున్న 17 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలనే నిర్ణయాన్ని ధర్మాసనం నిలిపివేసింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2004 రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది సెక్యూలరిజం సూత్రాన్ని ఉల్లంఘించదని తెలిపింది. ఈ చట్టం పూర్తిగా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఇదే సమయంలో కొన్ని నిబంధనలను మినహాయించి చట్టం చెల్లుబాటును సమర్థించింది.
సుప్రీం ఇంకేమంది?..
యూపీ మదర్సా చట్టంలోని అన్ని నిబంధనలు ప్రాథమిక హక్కులను, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించవని న్యాయమూర్తులు తెలిపారు. 2004లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. మదర్సాలలో నాణ్యమైన విద్యకోసం ప్రభుత్వం నియంత్రించవచ్చని చెప్పారు. సుప్రీం నిర్ణయంతో యూపీ వ్యాప్తంగా ఉన్న 16వేలకు పైగా మదర్సాలు కొనసాగుతాయని స్పష్టమైంది.