హస్తం మేనిఫెస్టో అబద్దాల మూట
విదేశీ చిత్రాలతో రూపొందిస్తారా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు మండిపడ్డ బీజేపీ నేత సుధాన్షు త్రివేది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధాల మూట అని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయగా అందులో విదేశాలకు సంబంధించిన ఫోటోలను వాడినట్లు సుధాన్షు త్రివేది మీడియాకు వివరించారు. ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ నిబద్ధతతో వ్యవహరించలేదని అన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల చిత్రాలు పొందుపరిచారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ రాకముందు, లేకముందు కూడా దేశంలో పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క అంశాన్ని నెహ్రూతో ముడిపెట్టి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది తామేనని కాంగ్రెస్ గొప్పలకు పోతోందన్నారు. 1930లోనే సివి.రామన్ నోబెల్ బహుమతిని సాధించారని, 1909లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటైందని సుధాన్షు గుర్తు చేశారు. వీరు మేనిఫెస్టోలో విడుదల చేసిన చిత్రాలు న్యూయార్క్‌లోని బఫె నదికి సంబంధించినవని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో కూడా విదేశాల చిత్రాలు ఏర్పాటు చేయడం వీరి అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాగా కాంగ్రెస్ మేనిఫెస్టోను మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అధ్యక్షతన రూపొందించడం విశేషం. అయితే ఈ మేనిఫెస్టోలోని చిత్రాలపై సామాజిక మాధ్యమాల్లో పలు విమర్శలు వస్తున్నాయి.