భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు రూ. 230 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
హైటెక్ ల్యాబ్ లలో తయారీ కీలకంగా వ్యవహరించిన ఎన్ సీబీ, ఏటీఎస్
గాంధీనగర్/జైపూర్: భారీ డ్రగ్స్ రాకెట్ ముఠాను నార్కోటిక్స్ బ్యూరో గుట్టురట్టు చేసింది. ఎన్‌సీబీ ఆదివారం జరిగిన సోదాల్లో రెండు ప్రాంతాల్లో రూ. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 50 కిలోల ఎఫెడ్రిన్, 200 లీటర్ల అసిటోన్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్, రాజస్థాన్ లలోని జలోర్ భీన్మల్, జోధ్‌పూర్‌లోని ఒసియన్, గాంధీనగర్, అమ్రేలిలలో తెల్లవారుజామున 4 గంటల నుంచి దాడులు నిర్వహించారు. దీని కింద 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణ ఆధారంగా ప్రస్తుతం ముఠా ప్రధాన నాయకుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్న నాలుగు హైటెక్ ల్యాబ్‌లను కూడా కనుగొన్నారు. ఇక్కడ నుంచే నిందితులు డ్రగ్స్ ను తీసుకొని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ మూలాలను పసిగట్టేందుకు గత కొన్నిరోజులుగా ఎన్ సీబీ ఏటీఎస్ తో కలిసి సంయుక్తంగా దృష్టి సారించింది. గుట్టుచప్పుడు కాకుండా అందిన సమాచారం మేరకు ఒక్కసారిగా దాడులు చేసింది.