మూడు ముక్కలైన సిరియా
Syria in three parts
ప్రజాస్వామ్య విజయమా?
కుయుక్తుల పాచిక పారిందా?
అధ్యక్షుడు అసద్ ఎక్కడా?
అబూ మహమ్మద్ గొలానీ కాబోయే అధ్యక్షుడా?
ఇటు ఐడీఎఫ్, అటు టర్కీ బఫర్ జోన్లలో పాగా!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రపంచంలో మరో దేశం ముక్కలైంది. ఇప్పటికే మూడుముక్కలాటగా కొనసాగుతున్న సిరియా యుద్ధం కాస్త ఐదు ముక్కలైనా ఆశ్చర్యపోనవరం లేదనే వాదనలున్నాయి. పైకి మాత్రం దేశాలన్నీ సిరియా స్వాతంత్ర్య, పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని చెబుతున్నా లోలోపల ఎవరి కుయుక్తులు వారికే ఉన్నాయి.
ఐడీఎఫ్ ఆధీనంలో బఫర్ జోన్..
సిరియా అధ్యక్షుడు అల్ అసద్ దేశం విడిచిపారిపోయాక అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఇజ్రాయెల్ తో సరిహద్దును పంచుకుంటున్న సిరియా 10కి.మీ. మేర భూభాగాన్ని (బఫర్ జోన్) ఐడీఎఫ్ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే గాకుండా ఏకంగా అక్కడ సరిహద్దు ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టింది. ఇంకోవైపు ఇదే అదనుగా భావించిన టర్కీ తమదేశంతో సిరియా సరిహద్దును ఆక్రమించేందుకు భారీ దాడులకు తెగబడుతుందని టర్కీ అధ్యక్షుడు ఎర్దగాన్ సరిహద్దును ఆక్రమించుకోవాలని సైన్యాన్ని ఉసిగొల్పారనే వాదనలు వినబడుతున్నాయి.
ఉగ్ర గ్రూపులకు గొలానీ నేతృత్వం..
ఇంకువైపు కుర్ధిష్, ఐఎస్ ఐఎస్, హెచ్ టీఎస్ వంటి ఉగ్ర గ్రూపులకు నేతృత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్ గొలానీ ఆధీనంలో సిరియాలోని పలు ప్రాంతాలున్నాయి. మొత్తానికి సిరియా ప్రస్తుతం మూడు ముక్కలుగా ఉండగా, అమెరికా, రష్యాల కన్ను కూడా ఈ దేశంపై పడింది. సిరియాలోని తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలని ఇరుదేశాలు ఉవ్విళూరుతున్నాయి. భౌగోళికంగా సిరియా ఐదు ముక్కలుగా విభజించబడనుందా? లేదా ప్రస్తుతానికి మూడు ముక్కలుగానే ఉండనుందా? లేదా భవిష్యత్ లో సిరియాలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఐడీఎఫ్, టర్కీ ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?.
సిరియా అంతర్యుద్ధం.. తమ పనికానిచ్చేసిన ఇజ్రాయెల్, టర్కీ..
సిరియాలోని లక్ష్యాలపై ఓ వైపు ఇజ్రాయెల్, అమెరికా, రష్యాలు భారీ దాడులకు తెబడుతుండగానే తిరుగుబాటుదారులు తమ పని చక్కదిద్దుకున్నారు. దీన్ని గమనించిన అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయాడు. సిరియాలో అలవైట్ కమ్యూనిటీకి అనుకూలంగా అధ్యక్షుడు వ్యవహరించడం, ధరల పెరుగుదల, దేశ కరెన్సీ క్షీణించడం వంటి కారణాలతో 2011 నుంచి అసద్ పై తిరుగుబాటు మొదలైంది. అయితే సైన్యం సహాయంతో అసద్ ఈ తిరుబాటును ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రస్తుతానికి అప్పట్లో తిరుగుబాటుకు పాల్పడ్డ వారు సిరియా జైళ్లలో నుంచి విడుదలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రష్యా సహాయంతో మరోమారు పరిపాలనపై పట్టుబిగించాలనుకున్న అధ్యక్షుడు అసద్ కోరిక నెరవేరలేదు. ఇజ్రాయెల్, టర్కీ, అమెరికాలు ఒక్కటి కావడం తిరుగుబాటుదారులకు పూర్తి మద్ధతు ప్రకటించడంతో రష్యా దళాలు వెనక్కు తిరగక తప్పలేదు.
ఐదు నగరాల హస్తగతం..
తిరుబాటుదారులు అలెప్పో, హమా, దారా, హోమ్స్, డమాస్కస్ వంటి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోగా ఇజ్రాయెల్, టర్కీలు సిరియా సరిహద్దుల్లో పాగా వేశాయి. అమెరికా విధానం ప్రపంచానికి ప్రమాదకరమేననే వాదనలు ఉన్నాయి. గతంలోనూ అఫ్ఘాన్–తాలిబాన్ ల మధ్య అమెరికా కల్పించుకొని మరి అక్కడ పాగా వేసింది. చివరకు అఫ్ఘాన్ ను అమెరికా దళాలు వీడి వెళ్లడంతో ఆ దేశం కాస్త తాలిబాన్ ల వశమైంది.ప్రస్తుతం సిరియాలో కూడా ఇదే తంతు కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రష్యా గప్ చిప్.. తమ సైనికులు సురక్షితమే..
రష్యాకు చెందిన సైనిక స్థావరం సిరియాలో ఉంది. ఇది అసద్ అధ్యక్ష పీఠానికి ముప్పు ఏర్పడగానే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తిరుగుబాటుదారులను అణచివేస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, టర్కీ, అమెరికాలు అడ్డుగోడలుగా నిలవడంతో రష్యా–సిరియా అధ్యక్షుడు అసద్ పాచికలు పారలేదు. దీంతో మధ్యప్రాచ్యంలో రష్యా ఉనికికి కూడా ప్రమాద ఘంటికలు మోగినట్లే. అదే సమయంలో తమ సైనిక స్థావరాన్ని కాపాడుకునేందుకు రష్యా ముందుకు వస్తుందా? లేదా గప్ చిప్ గా వెనక్కు వెళుతుందా? సమయం కోసం వేచి చూస్తుందా? అనేది తెలవాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం తమ దళాలను వెనక్కు రప్పిస్తున్నామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికా: సిరియాలోని అన్ని పక్షాలను కలుపుకొని స్వాతంత్ర్య సిరియాగా చూడాలనుకుంటున్నాం. ఈ దేశ పరిస్థితులకు అధ్యక్షుడు అసద్ కారణం.
రష్యా: తమ సైనికులు సిరియాలో సురక్షితంగా ఉన్నారు. తమ సైనికుల సురక్షితానికి సంబంధించి సిరియాలోని తిరుగుబాటుదారుల నుంచి తమకు హామీ లభించింది.
యూఎన్ (ఐక్యరాజ్యసమితి): సిరియాలో శాంతి నెలకొనాలి. నూతన ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేసేదిగా ఉండాలి.
బ్రిటన్: సిరియాలో జరిగింది ప్రజాస్వామ్య విజయమా? దురదృష్టకరమా? అన్నది ఇప్పుడే చెప్పలేం. సిరియా ప్రజలు అసద్ ప్రభుత్వంలో కష్టాలను అనుభవించారన్నది వాస్తవమే. నూతన ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తాం.
ఇజ్రాయెల్: పశ్చిమ ఆసియా చరిత్రలో ఇదో చారిత్రాత్మకమైన రోజు. అసద్ ప్రభుత్వం పతనం ఇరాన్ కు గుణపాఠం. అదే సమయంలో సిరియాలో ఇంకా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు.
చైనా: సిరియా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. తిరుగుబాటుదారులతో ఏర్పాటయ్యే ప్రభుత్వం చైనా జాతీయుల ప్రయోజనాలను కాపాడాలి.
టర్కీ: తిరుగుబాటుదారులకు పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నాం. అసద్ పాలనలో సిరియాకు అంటుకున్న మరకలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నాం.