స్వయం శక్తి చాలకం యోగా

10వ అంతర్జాతీయ వేడుకల్లో ప్రధాని మోదీ

Jun 21, 2024 - 13:23
 0
స్వయం శక్తి చాలకం యోగా

శ్రీనగర్​: యోగాను ప్రపంచ దేశాలు స్వయం శక్తి చాలకంగా చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే భారత్​ లో నిర్వహిస్తున్న యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. జమ్మూకశ్మీర్​ లోని శ్రీనగర్​ దాల్​ సరస్సులో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏడువేల మందితో కలిసి నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. 

విశేషాదరణ..

2015లో భారత్​ ప్రపంచానికి యోగాను పరిచయం చేశాక దీనికి విశేషాదరణ లభిస్తోందన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ తెలిపారు. 

ఆమోదించిన 177 దేశాలు..

యోగా సాధన ద్వారా మానసిక శక్తి, ప్రశాంతత చేకూరుతుందన్నారు. అందుకే యోగాను ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో 177 దేశాలు ఆమోదించాయన్నారు. యూఎన్​ ప్రధాన కార్యాలయంలోనూ నేడు యోగాలో 130 దేశాలు పాల్గొనడం ఓ చరిత్ర అన్నారు. 

సాధన కృషియే యోగా..

యోగా ఒక దేశానికి సంబంధించినది కాదని మోదీ తెలిపారు. యోగా అనేది మానవాళి విశేష సాధన కృషి ఫలితమన్నారు. దీని ద్వారా మానవాళి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేషాధారణ లభిస్తుందని తెలిపారు. 

మానవాళి మనుగడలో కీలకపాత్ర..

ప్రపంచంలో పలు యూనివర్సిటీలు కూడా యోగాను ప్రారంభించడం సంతోషకరమన్నారు. యోగా థెరపీని కూడా ప్రారంభించాయన్నారు. తుర్కెమెనిస్థాన్​, సౌదీ, మంగోలియా, ఐరోపా, జర్మన్​, అమెరికా, బ్రిటన్​ ఇలా అనేక దేశాలు యోగాను మానవాళి మనుగడకు ఉపయోగిస్తున్నాయన్నారు. 

లక్ష్యంపై గురి..

యోగా ద్వారా మానవునిలో శాంతి నెలకొంటుందని చేరాల్సిన లక్ష్యంపై గురి పెరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రపంచంలో నూతన ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయన్నారు. యోగా శిక్షకులుగా అనేకమంది ఈ వృత్తిని స్వీకరించి నూతన జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేయడం సంతోషకరమన్నారు. యోగాకు ప్రత్యేకంగా ఒకదేశం, ఒక స్థలం అంటూ ఏమీ ఉండదన్నారు. హోటళ్లు, రిసార్టులు, విమానాశ్రయాలు, మైదానాలు ఎక్కడైనా ప్రశాంత వాతావరణంలో యోగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. మనిషి శాంతంగా ఉన్నప్పుడే ప్రపంచంపట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతోందన్నారు. ఇదే ప్రపంచాభివృద్ధికి కారణంగా నిలుస్తుందన్నారు. అంతరిక్షం, సైనిక శక్తి, ఖైదీలు ఇలా అన్ని చోట్లా యోగా ప్రాముఖ్యత పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు.

పర్యాటకం పెరుగుదల..

యోగా ద్వారా జమ్మూకశ్మీర్​ లో పర్యాటకం మరింత పెరుగుతోందని మోదీ తెలిపారు. యోగా కార్యక్రమంలో ఇక్కడి ప్రజలకు అనుబంధం ఉందన్నారు. యోగాకు జమ్మూకశ్మీర్​ ప్రజల మద్దతునీయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.