పచ్చిరొట్టవిత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ నలుగురు అధికారుల సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ గోపీ
నా తెలంగాణ, డోర్నకల్: పచ్చిరొట్ట విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన నలుగురు వ్యవసాయ అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండల వ్యవసాయ అధికారితో పాటు మరో ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏ.ఈ.ఓ) సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో తొర్రూరు మండలం వ్యవసాయాధికారి కె. సోమకుమార్ యాదవ్, క్లస్టర్ గ్రేడ్ -2 ఏఈఓ ఎం. జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవో అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవో సిహెచ్ అరవింద్ లను సస్పెండ్ చేస్తూ కమిషనర్ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. విత్తనాలు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడంపై పలు వార్తలు రాగా వీటిపై విచారణ చేయాలని కమిషనర్ గోపీ ఆదేశించారు. విచారణలో అవకతవకలు, బ్లాక్ మార్కెటింగ్ నిజమేనని నివేదిక సమర్పించారు. తొర్రురు మండల వ్యవసాయాధికారి కె. సోమకుమార్ యాదవ్ కు చెందిన ఓఎస్ఎస్డీఎస్ పోర్టల్ లాగిన్ ను నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఏఈవోలకు ఇవ్వడంతో వారు దీనిని దుర్వినియోగం చేశారు. విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడ్డట్లు గుర్తించారు.
ఏది ఏమైనా రైతు వ్యతిరేక చర్యలు, పంట విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్, కల్తీ విత్తనాలను అమ్మితే ఎంతపెద్ద వారినైనా వదలవద్దని సీఎం కార్యాలయం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని కమిషనర్ గోపీ తెలిపారు.