నా తెలంగాణ, సంగారెడ్డి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సమయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యస్.హెచ్.ఒ.లు ప్రతి మండపాన్ని ప్రత్యక్షంగా సందర్శించాలని, అక్కడ మండపాల వద్ద భద్రతపరమైన ఏర్పాట్ల గురుంచి పరిశీలించాలన్నారు. వినాయక ప్రతిష్టాపనకై ఏర్పాటు చేసే మండప నిర్మాణం రోడ్లపై చేపట్టకుండా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. భద్రత దృష్ట్యా ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. డీజేలకు అనుమతించొద్దన్నారు. సౌండ్ బాక్సులను రాత్రి 10 గంటల వరకే అనుమతించాలన్నారు. నిమజ్జనానికి గత ఈతగాళ్లను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పాత నేరస్తులను ముందుగానే బైండోవర్ చేయాలని, ఏ చిన్న సమస్య ఉన్నా 100కు డయల్ చేయాలన్నారు.