కొండాకు అండగా చేవెళ్ల
బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డికి అనుకూల పవనాలు – కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు – బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి పట్టు దొరికేనా! – మూడు పార్టీల నేతల హోరాహోరీ ప్రచారం – కమలం పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్న సర్వే సంస్థలు
నా తెలంగాణ, రంగారెడ్డి ప్రతినిధి: ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు వెనుకబాటుతనం.. మొత్తం కలిస్తే చేవెళ్ల నియోజకవర్గం. నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు.. చుట్టుపక్కల మూడు గ్రామీణ నియోజకవర్గాలతో చేవెళ్ల లోక్‌సభ నియోజక వర్గం స్వరూపమిది. నగర పరిధిలోని హైటెక్ సిటీ, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఫార్మాసిటీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సొంతం. గ్రామీణ ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు మిగితా నియోజకవర్గాలతో పోల్చితే వెనుకబాటుతనంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 2009లో ఏర్పాటైన చేవెళ్ల పార్లమెంట్ తీర్పు తొలినుంచే విలక్షణమే. ఇప్పటి వరకూ ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోమారు విజయతీరానికి చేరలేక చతికిలపడ్డారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతుండగా.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాషాయ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ దళం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోరుకు సై అంటున్నారు. ఇప్పటికే చేవెళ్ల సీటుపై పాగా వేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ లు మరోమారు సత్తా చాటేందుకు సమాయత్తమవుతుండగా.. తొలిసారి కమలం జెండా ఎగురవేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడు పార్టీల బలాబలాలు, వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం..
2009లో ఏర్పాటు..
హైదరాబాద్ లోక్ సభ నియోజవర్గంలో అంతర్భాగంగా ఉండే చేవెళ్ల.. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో ఏర్పాటైంది. రంగారెడ్డి, వికారాబాద్ రెండు జిల్లాల్లో ఈ స్థానం విస్తరించి ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నగరంలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవేళ్ల కాగా.. గ్రామీణ వాతావరణ ఉండ వికారాబాద్, తాండూరు, పరిగి లు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 29 లక్షలపైచిలుకు ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు 14,20,158, మహిళలు 14, 93647, ఇతరులు 290 మంది ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవేళ్ల నియోజకవర్గాల్లో గులాబీ దళం పాగా వేసింది. చేవేళ్ల స్థానంపై కన్నేసిన మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతుండగా.. ఇంతకు ముందు హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అంతర్భాగంగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ఎంఐఎం కూడా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. పతంగి పార్టీ నిజంగా ఒంటరిగా బరిలోకి దిగుతుందా..? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి మద్దుతు ఇస్తుందా.? అనేది ఆసక్తి రేపుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నుంచి విజయకేతనం ఎగురవేసిన గడ్డం ప్రసాద్ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు.
ఆసక్తికర పోటీ..
చేవెళ్ల రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అక్కడ పోటీ చేయబోతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినవారే. ఈసారి ఆ ఇద్దరు అభ్యర్థులనే ప్రత్యర్థులుగా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్.! 2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2014లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా.. 2019లో రంజిత్ రెడ్డి జయకేతనం ఎగురవేశారు. 2009లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి విజయఢంకా మోగించారు. మారిన రాజకీయ పరిణామాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగా, రంజిత్ రెడ్డి తాజగా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా గుర్తింపు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ కొత్త బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ బీఆర్ఎస్ నేతలను ఎంతమేరకు ఎదుర్కొంటాడో ఆసక్తి కలిగిస్తోంది.
‘కొండం’త విజయం ఖాయమే..!బీజేపీ తరుఫున బరిలోకి దిగిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా బలంగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఎంపీగా పని చేయడం, బీజేపీ బలం, మోదీ వేవ్, నియోజకవర్గంలో కుటుంబ నేపథ్యం, పెద్ద ఎత్తున బంధుగణం వంటివి ఆయనకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ కూడా నియోజకవర్గంలో ఆయనకు బలంగా మారుతోంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే సొంత నిధులతో చేసిన పనులు ఆయనను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. తాను సొంతంగా పార్లమెంట్ సెగ్మెంట్ లోని 200 గ్రామాల్లో సొంత నిధులతో టాయిలెట్లను నిర్వహిస్తున్నారు. గత ఎనిమిది, తొమ్మిదేళ్లుగా ప్రతి రోజూ ఆ టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత తన సొంత టీమ్ చూసుకుంటుంది. అవగాహన కల్పించే ఉద్దేశంతో తానే టాయిలెట్లను కూడా ఆయన శుభ్రం చేశారు. స్థానికంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలోని ఓ రిజర్వాయర్ ను టూరింగ్ హబ్ గా తీర్చిదిద్దారు. ఆ రిజర్వాయర్‌లో స్థానిక యువతకు బోట్ల నిర్వహణలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా కూడా తన సొంత నిధులతో చేస్తున్నారు. ఇలా తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడియారనే సానుభూతి కూడా ప్రజల్లో నెలకొంది. మోదీ చరిష్మా, దేశ భద్రత, జాతీయవాదం దృష్ట్యా కొండా విజయం నల్లేరుపై నడకే.
బలహీనం.. బీఆర్ఎస్..
సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్ కు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పెద్ద షాక్ తగిలింది. ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తరుఫున బరిలోకి దిగారు. అప్పటి వరకు ఉన్న క్యాడర్ అంతా రంజిత్ రెడ్డి వెంట వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనమైంది. అప్పటికప్పుడు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ను పోటీలోకి దింపింది. బీసీల్లో ఆయనకు ఉన్న అభిమానం తమకు కలసి వస్తోందని గులాబీదళం ఆశిస్తోంది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెల్ల అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. జాతీయ స్థాయి ఎన్నికకు ఓటర్లు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ గెలిచినా.. ఇక్క అధికారంలో లేదు. అక్కడ చేసేది ఏమి ఉండదు అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ నుంచే విజయం సాధించిన ఇద్దరు కూడా మరో రెండు పార్టీల తరుఫున బరిలో ఉండడం బీఆర్ఎస్ కు మరో తలనొప్పిగా కనిపిస్తోంది. ఇన్ని ఇబ్బందుల నడుమ కాసాని విజయం సాధిస్తారా..? లేదా..? అని శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పార్టీపై వస్తున్న ఆరోపణలతో ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతోంది.
ఎదురీదుతున్న రంజిత్.. కాంగ్రెస్ ఖతం?!.
14 పార్లమెంట్ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ చేవెళ్లను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహత్మకంగా పావులు కదిపినట్టు భావిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా వ్యతిరేకంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో కష్టపడ్డ వారిని కాదని సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని పోటీలోకి దింపింది. కానీ, ఆయనపై విపరీతమైన అవినీతి, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇటీవలే మీడియా సమావేశం పెట్టి ఆయన చేసిన అవినీతి బాగోతాన్ని బయటపెట్టాడు. కోళ్ల ఫారాల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కాజేశాడని ఆరోపించారు. పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఓ గ్రామంలోని దేవుని భూములు, గుట్టలను కూడా మింగాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులు ఈయన చేసిన అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూ.. వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆయన నాయకత్వంలో పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో అంతర్గతంగా ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా.. టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రచారాన్ని కూడా సరిగ్గా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో అధికారం అనుభవించి.. తీరా ఎన్నికల సమయానికి పార్టీని నట్టేట ముంచి కాంగ్రెస్ లో చేరడంపై గులాబీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఈయన ఓటమినే లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
చేవెళ్లకు మోదీ ఇచ్చిన నిధులు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.227.50 కోట్లతో 14,906 ఇండ్లను కేటాయించింది. రూ.134.15 కోట్ల నిధులు విడుదల కాగా.. ఇప్పటికే12,801 ఇండ్ల నిర్మాణం పూర్తైంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి కోట్ల నిధులు మంజూరు చేసింది. చెత్త సేకరణలో పౌర భాగస్వామ్యంతో సత్ఫలితాలను సాధిస్తోంది. అమృత్ పథకంలో భాగంగా అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కింద రూ.135.5 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అమృత్ 2.0 లో నియోజకవర్గ అభివృద్ధి కోసం మరో 14 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద నియోజకవర్గంలోని 3,509 మందికి రూ.43.37 కోట్ల రుణ సదుపాయం కల్పించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 1,381 స్వయం సహాయక సంఘాల ద్వారా 4,573 మందికి బ్యాంక్ రుణాలతో జీవనోపాధి మెరుగు పరచింది. మరో 822 మందికి ఉపాధి శిక్షణ అందించింది.