ఎంఎస్పీ చెల్లించకుంటే కఠిన చర్యలు
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సీఎం ఆగ్రహం మార్కెట్ యార్డుల్లో దగా చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలి జిల్లాలలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి ప్రజావసరాలకు తగ్గట్లుగా నీటి సరఫరా చేపట్టాలి మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నా తెలంగాణ, హైదరాబాద్: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, అందుకే ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని సీఎం రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు..
అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకారోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని అప్రమత్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు.