ఈ వానాకాలం రైతు భరోసా లేనట్లే!

ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదన్న మంత్రి

May 21, 2024 - 16:29
 0
ఈ వానాకాలం రైతు భరోసా లేనట్లే!
  • పది రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం​
  • ఇంకా పూర్తి కాని​ గత యాసంగి సీజన్ రైతు బంధు 
  • పంటకాలం ముగుస్తున్నా అందని పెట్టుబడి సాయం
  • కాంగ్రెస్​ సర్కారు తీరుపై రైతుల్లో వ్యతిరేకత

‘‘ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు చేయాలి. ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత చూద్దాం. ప్రజ‌ల‌కు ఇచ్చిన హమీలను ఒక‌టి త‌ర్వాత ఒక‌టి అమ‌లు చేస్తాం. రైతుబంధుతో పాటు మిగ‌తా హామీల‌ను కూడా నెర‌వేరుస్తాం’’
– శ్రీధర్​ బాబు, రాష్ట్ర మంత్రి(కేబినెట్​ భేటీ తర్వాత చేసిన వ్యాఖ్యలు)

నా తెలంగాణ, హైదరాబాద్​:

అధికారంలోకి రాగానే రైతు భరోసా పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయం ఏడాదికి ఒక ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్​.. ప్రభుత్వంలోకి వచ్చి అయిదు నెలలు దాటినా దాన్ని అమలు చేయలేదు. విధి విధానాలు ఖరారు కాలేదన్న పేరుతో మొన్నటి యాసింగి సీజన్​ లో ‘రైతు భరోసా’ ఎగ్గొట్టిన సర్కారు.. పది రోజుల్లో వానాకాలం సీజన్​ ప్రారంభం కాబోతున్నా.. ఇప్పుడూ అదే మాట చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కేబినెట్​ భేటీ తర్వాత మంత్రి శ్రీధర్​ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వానాకాలం సీజన్​ లో కూడా రైతు భరోసా లేనట్లేనని తేలిపోయింది.   

పెట్టుబడి సాయం ఇచ్చేదెపుడు?

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం పంట సీజన్​ ముందు సాయం చేయడం ప్రారంభించింది. ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 సాయం రైతుల ఖాతాల్లో వేస్తున్నది. కానీ కాంగ్రెస్​ సర్కారు వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చిన రైతు భరోసా హామీని పక్కనబెట్టడమే కాదు.. రైతుబంధు సాయం అందించడంలో జాప్యం చేస్తున్నది. గత డిసెంబర్​ లో మొదలు పెట్టిన రైతు బంధు సాయం పంపిణీ యాసంగి సీజన్​ పూర్తయి.. కొనుగోళ్లు తుది దశకు వచ్చినా.. ఇంకా పంట పెట్టుబడి సాయం రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు. మరో పది రోజుల్లో వానాకాలం సీజన్​ ప్రారంభం కాబోతున్నది. విత్తనాలు, ఎరువుల కోసం రైతులకు డబ్బులు కావాలి. ప్రభుత్వం పంట సీజన్​ కు ముందే సాయం అందిస్తే.. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సర్కారు పంట సీజన్​ కు ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సీజన్​ పూర్తయినా ఇవ్వడం లేదు. దీంతో రైతుల్లో కాంగ్రెస్​ పార్టీ తీరుపై వ్యతిరేకత పెరుగుతున్నది.