నా తెలంగాణ, హైదరాబాద్: రాక సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. శనివారం ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు రాక సూర్య (26) మృతి చెందారు. దీంతో రాక సుధాకర్ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ ఎస్ రావు నగర్ దమ్మాయిగూడ లోని ఆయన ఇంటికి వచ్చి సంతాపం ప్రకటించారు. రాక సూర్య లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత పది రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సూర్య అంత్యక్రియలు మధ్యాహ్నం తరువాత నిర్వహించనున్నారు. చిన్నవయసులోనే సూర్య మృతితో రాక సుధాకర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
రాకలోకం పేరుతో రాక సుధాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నారు. ఆయన అనుక్షణం దేశం, ధర్మం కోసం పాటుపడుతూ మన్ననలు దక్కించుకున్నారు. అనేక వేదికలపై ఆయన ప్రపంచ, దేశ వ్యాప్తంగా పలు సందేశాలను పంచుకున్నారు. వివిధ విభిన్న వేదికలపై రాక సుధాకర్ ప్రశంసలు, గౌరవాలు, సన్మానాలు దక్కించుకున్నారు. రాక సుధాకర్ కు సూర్య ఒక్కడే కుమారుడు.