తెలంగాణ కశ్మీర్​ లో కమల వికాసం

ఆదిలాబాద్​ లో విజయం బీజేపీదే  – తేల్చి చెబుతున్న సర్వే సంస్థలు, ఒపీనియన్​ పోల్స్​ – సిట్టింగ్​ స్థానంలో మరోసారి కాషాయ రెపరెపలు – అదనపు బలంగా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు – కారు పార్టీ ఖాళీ.. కష్టకాలంలో కాంగ్రెస్​ పార్టీ – గత ఐదేండ్లలో ఆదిలాబాద్​ కు మోదీ సర్కారు నిధులు – ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​ కే ఓటు వేస్తామంటున్న జనం

Apr 12, 2024 - 16:26
 0
తెలంగాణ కశ్మీర్​ లో కమల వికాసం

తెలంగాణ కశ్మీర్​ గా పిలిచే ఆదిలాబాద్​ లో కమలం వికసించబోతున్నది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతున్నది. సిట్టింగ్​ స్థానంలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి అదనపు బలంగా మారారు. మరోవైపు కారు పార్టీ ఖాళీ కాగా.. కాంగ్రెస్​ పార్టీ కష్టాలను ఎదురీదుతున్నది. గత ఐదేండ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదిలాబాద్​ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. ఇవి గళ్లీ ఎన్నికలు కాదు.. ఢిల్లీ ఎన్నికలు కాబట్టి మోదీకే తమ ఓటు అని ఆదిలాబాద్​ అడవి బిడ్డలు తేల్చి చెబుతున్నారు. 

ఆదిలాబాద్​ నుంచి నా తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి: 

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ లో  ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ డ్ గా మారినప్పటి నుంచి ఇక్కడ జరిగిన మూడు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా రెండోసారి గెలుపొందలేదు. కానీ చరిత్రను తిరగరాస్తూ.. ఈసారి సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్నది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలంగా ఉన్నది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి మంచి పట్టు పెరిగింది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమనే విశ్లేషణలు వస్తున్నాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో తొలిసారిగా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో 2024 ఎన్నికలకు బీజేపీ మంచి బూస్ట్‌ దొరికినట్లు అయింది.  ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​ తో కలిసి, విడివిడిగానూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే​ పాయల్​ శంకర్, నిర్మల్ లో బీజేఎల్పీ నేత​ మహేశ్వర్​ రెడ్డి, ముథోల్​, భైంసాలో రామారావు పటేల్, సిర్పూరులో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ బాబు నలుదిక్కులా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఆదిలాబాద్​ ఎంపీ స్థానంలో ఓటర్లు

నియోజకవర్గం    మహిళలు    పురుషులు
ఆదిలాబాద్       1,24,375    1,19,154
బోథ్​                   1,08,580    1,02,333
నిర్మల్​               1,35,702    1,21,527
ముథోల్​             1,30,545    1,23,234
ఆసిఫాబాద్​        1,14,437    1,09,333
సిర్పూర్​             1,14,359    1,14,484
మొత్తం ఓటర్లు   16,4​4,484

బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి..

ఆదిలాబాద్​ నుంచి బీజేపీ ఈసారి బలమైన అభ్యర్థి గోడం నగేశ్​ ను బరిలోకి దింపింది. ప్రస్తుత ఎంపీ సోయంబాపూరావుకు జాతీయ స్థాయిలో మంచి పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించిన కమలం పార్టీ.. నగేశ్​ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని నాయకులను ఆదేశించింది. టికెట్​ నిరాకరించడంతో కొంత అలక వహించిన సోయం బాపూరావు.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఇచ్చిన హామీతో అలకవీడి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానను ప్రకటించారు. కాగా గోడం నగేశ్​ బలమైన నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ఎస్టీ రిజర్వ్ డ్ గా మారిన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి రమేశ్​ రాథోడ్​ విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి గోడం నగేశ్​ విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కైవసం చేసుకున్నారు. ఇలా నగేశ్​ కు ఇప్పటికే ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్నది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​.. గ్రామాల వారీగా, ఆయా సంఘాల వారీగా ప్రజలను కలుస్తున్నారు. మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని, ఎంపీగా తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ ప్రజల ప్రధాన డిమాండ్లుగా ఉన్న ఆర్మూర్‌– -ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌కు నిధులు,  మూతపడిన ఆదిలాబాద్‌ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభం, ఆదిలాబాద్​ లో ఎయిర్‌పోర్టు నిర్మాణం,  ఉట్నూర్‌లో గిరిజన వర్సిటీ, జిల్లాలో పత్తిసాగు చేస్తున్న రైతుల ఉపాధిని మెరుగుపర్చడానికి టైక్స్‌టైల్‌ పార్కు లాంటి హామీలు మోదీ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని బీజేపీ అభ్యర్థి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అందుకే ప్రజల్లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థి పట్ల సానుకూల దృక్పథం కనిపిస్తున్నది. 

కారు పార్టీ డీలా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు మింగుడు పడని విషయంగా ఉంది. 2018  ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది సీట్లకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది. బీజేపీ ఇక్కడ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అలాంటిది 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమవగా.. కాంగ్రెస్, బీజేపీలు చెరో 4 స్థానాలు గెల్చుకున్నాయి. అయితే 9 స్థానాలను 2018లో గెల్చుకున్నప్పటికీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ చతికిల పడింది. ఈ స్థానాన్ని బీజేపీ గెల్చుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నాలుగింటిలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా, రెండింటిలో బీఆర్ఎస్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న బీఆర్ఎస్ ఎంపీ స్థానాన్ని గెల్చుకోవడం అసాధ్యంగా కనిపిస్తున్నది. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని ఢీకొనడం.. అంత ఈజీ కాదు. అందులోనూ ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెల్చుకుని మరోమారు తన బలం నిరూపించుకుంది. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును బరిలోకి దింపింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒకరిద్దరు సీనియర్లు తప్ప చెప్పుకోదగ్గ నేతలెవ్వరు ఇప్పుడు కారు పార్టీలో లేరు. దీంతో ప్రచారం చేసేందుకు ముఖ్య నాయకులు లేని పరిస్థితిలో బీఆర్​ఎస్​ ఉన్నది. గెలుపు మాట అటుంచితే.. కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా బీఆర్​ఎస్​ అభ్యర్థి లేకపోవడం గమనార్హం. 

కాంగ్రెస్​ అంతంతే..

కాంగ్రెస్​ పార్టీకి ఆదిలాబాద్​ ఎంపీ స్థానంలో అభ్యర్థులే లేని తరుణంలో.. ఆ పార్టీ అనూహ్యంగా ఆత్రం సుగుణ పేరు ఖరారు చేసింది. సుగుణ.. మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. మొదటి నుంచి వామపక్ష భావజాలం కలిగిన ఆమె.. ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ మలదశ ఉద్యమంలోనూ యాక్టివ్ గా పాల్గొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ.. ఒక నాయకురాలిగా ప్రజలు అక్కున చేర్చుకునేంతటి నేత మాత్రం కారు. టీచర్​ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్​ పార్టీలో చేరిన సుగుణ.. ఎంపీగా గెలిచి పార్లమెంట్​ లో కొట్లాడి ఆదిలాబాద్​ కు నిధులు ఏ మాత్రం తేగలరనేదానిపై జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్​ వచ్చే పరిస్థితి లేనందున.. సుగుణను గెలిపిస్తే.. ప్రతిపక్ష ఎంపీగా తన వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ఆదివాసీ సంఘాల నేతలు, యువకులు ఆలోచిస్తున్నారు. ఒక సాధారణ స్కూల్​ టీచర్​ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందులోనూ.. బీజేపీకి పట్టు ఉన్న, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఓట్లను ఏమాత్రం ఒడిసి పడ్తారనేది అనుమానమే! ఆదిలాబాద్​ ఎంపీ స్థానం ఇన్​ చార్జిగా మంత్రి సీతక్క ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ.. బీజేపీని కాదని ఆదివాసీలు, గిరిజనులు కాంగ్రెస్​ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఆమె చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

ఆదివాసీలు బీజేపీ వైపే..

బీజేపీ, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మూడు పార్టీల అభ్యర్థులు ఆదివాసీలే. అయితే ఈ మూడు పార్టీల్లో ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసిన పార్టీ మాత్రం కేంద్రంలోనీ బీజేపీ మాత్రమే. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసింది బీజేపీ. ఆదివాసీ పండుగ సమ్మక్క, సారక్క జాతరకు నిధులు విడుదల చేసింది కేంద్రం.. ఆ వనదేవతల పేరుతోనే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసి ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించింది. ఇందులో తెలంగాణ ఆదివాసీ బిడ్డలకే మెజార్టీ సీట్లు వచ్చేలా కేంద్రం కృషి చేసింది. గిరిజన ప్రాంతంలోనే ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత కేంద్రానిది. లక్నవరం టూరిజం సర్క్యూట్​ కు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. అందుకే ఆదివాసీలు 2019లో, ఇప్పుడు కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు16.44 లక్షల ఓట్లు ఉండగా.. అందులో సుమారు 3 లక్షల వరకు ఆదివాసీ ఓటర్లే.  ఈ  క్రమంలో అభ్యర్థుల గెలుపోటములపై వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది.  ఇప్పుడున్న ముగ్గురు అభ్యర్థులు ఆదివాసీలే అయినప్పటికీ..  ఆదివాసీల కోసం కృషి చేసిన పార్టీ, అభ్యర్థి వ్యక్తిగత చరిత్ర ఆధారంగా ఆదివాసీలు.. బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నది. 

సర్వేలన్నీ బీజేపీ వైపే..

ఆదిలాబాద్​ ఎంపీ స్థానం.. ఈసారి కూడా బీజేపీదే అని అన్ని సంస్థలు, ప్రీపోల్​ ఒపీనియన్​ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. తాజాగా జన్​ లోక్​ పోల్​ సర్వేలో  బీజేపీ 48.50 శాతం ఓట్​ షేర్​ తో ముందంజలో ఉంటుందని, కాంగ్రెస్​ 36.05 శాతంతో, బీఆర్​ఎస్​ 12.19 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్​ 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 2 శాతం శాంపిళ్లను పరిగణనలోకి తీసుకొని ఫలితాలను విశ్లేషించినట్లు సర్వే సంస్థ ప్రకటించింది. 

ఆదిలాబాద్​ కు మోదీ ఏమిచ్చారు?

43 ఏండ్ల అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పర్యటించిన ప్రధాని మోదీ.. ఆదిలాబాద్ కు వరాల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా రెండు రాష్ట్రాలను కలుపుతూ రూ. 450 కోట్లతో నిర్మాణం కానున్న డబుల్ లైన్ రహదారికి శంకుస్థాపన చేశారు. అమృత్ పథకంలో భాగంగా రూ. 222 కోట్లతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, తాగు నీటి కోసం పైప్ లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ ద్వారా రూ.3,620 కోట్లతో మున్సిపల్ , పంచాయతీ వార్డుల్లో  వ్యర్థాల నిర్వహణకు మోదీ చర్యలు తీసుకున్నారు.  అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణలో భాగంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ పట్టణాల్లో 5 ప్రాజెక్టులకు రూ.80.77 కోట్లతో 23.59 ఎకరాల్లో పచ్చదనం పెంపుదల, ఉద్యాన వనాల అభివృద్ధికి కృషి చేశారు. అమృత్ 2.0 పథకం కింద రూ.395.96 కోట్లతో మరో 4 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.395.96 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 30,621 మందికి రూ. 51.74 కోట్ల రుణసదుపాయం అందించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పట్టణ జీవనోపాధి మిషన్ అనుసంధానంగా 1318 స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4,134 మందికి బ్యాంకు రుణాలు అందించి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. 2,451 మందికి ఉపాధి శిక్షణ అందించారు. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

మొత్తం ప్రాజెక్టులు    17 
కేటాయించిన ఇండ్లు              6,245
నిర్మాణం మొదలైన ఇండ్లు    5,615
పూర్తయిన ఇండ్లు                   5,233
మంజూరైన నిధులు రూ.100.85 కోట్లు

ప్రధానమంత్రి జన్​ మన్​: ఆదివాసీ గిరిజనుల్లో ఎక్కువ మంది అంతరించిపోతున్న ఆదిమ గిరిజన జాతుల్లో  సికిల్​ సెల్​ తో బాధపడుతున్నట్లు గుర్తించిన మోదీ ప్రభుత్వం.. ఆ వ్యాధిని పోగొట్టడానికి చర్యలు ప్రారంభించింది. వంశపారంపర్యంగా వస్తున్న ఈ వ్యాధిని అంతం చేసేందుకు ‘సికిల్​ సెల్​ డిసీజ్​ ఎలిమినేషన్​ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్​ లో ప్రధానమంత్రి జన్​ జాతి ఆదివాసీ న్యాయ్​ మహా అభియాన్​ కార్యక్రమం చేపట్టింది. బాధితులను గుర్తించి వైద్యం అందించేందుకు సర్వే చేస్తున్నది. ఇప్పటికే మొదటి రెండు విడతల్లో ఆదిలాబాద్​ జిల్లాలో 43,423 పరీక్షలు, మంచిర్యాలలో 7,454, కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో 25,611 పరీక్షలు నిర్వహించింది. 

లఖ్​ పతి దీదీ

ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత మధ్యంతర బడ్జెట్​ లో ప్రవేశపెట్టిన లఖ్​ పతి దీదీ పథకం కింద ఆదిలాబాద్​ జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమం నడుస్తున్నది. జిల్లాలో 547 గ్రామైక్య సంఘాలు ఉండగా.. వాటిలో 359 సంఘాలను తొలి విడతగా గుర్తించిన కేంద్రం ప్రతి సంఘానికి 80 మంది చొప్పున మొత్తం 28 వేల మంది మహిళలను లఖ్​ పతి దీదీ కింది లక్షాధికారులను చేయనుంది