రుతుపవనాల మందగమనం

నెల పూర్తవుతున్న ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు జూలై నుంచి సెప్టెంబర్​ లో కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ

Jun 26, 2024 - 17:18
 0
రుతుపవనాల మందగమనం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మరో మూడు రోజులైతే జూన్​ నెల ముగియనుంది. ఆశించిన స్థాయిలో ఈ సారి వర్షపాతం నమోదు కాలేదు. రుతుపవనాల మందగమనమే ఇందుకు కారణమని బుధవారం ఐఎండీ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. కురియాల్సిన వర్షపాతం కంటే 19 శాతం తక్కువ నమోదైందని తెలిపారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంలో ఆలస్యం చోటు చేసుకోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు నెల మొదటి వారంలోనే విస్తరించినా అక్కడ కూడా ఆశించిన మేర వర్షాలు పడలేదని మహాపాత్ర తెలిపారు. రుతుపవనాల వేగం మందగించేందుకు బంగాళాఖాతంలో వాతావరణం బలహీనపడడమే కారణంగా పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా 19 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. వాయువ్య భారతంలో 57 శాతం తక్కువ, తూర్పు, ఈశాన్య భారతంలో 16 శాతం, మధ్య భారతంలో 23 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని మహాపాత్ర వెల్లడించారు. జూలై నుంచి సెప్టెంబర్​ లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మహాపాత్ర వెల్లడించారు.