నా తెలంగాణ, సంగారెడ్డి: జిల్లాలో శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వినాయకుల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మీడియాకు ఎస్పీ వివరించారు.
గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలో విద్యుత్ వైర్లను తొలగించడం, ఎత్తులో ఏర్పాటు చేయించామన్నారు. డైవర్షన్ లు కూడా చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్లలో మసీదులు, దర్గాలు, చర్చీల వద్ద ఎత్తైన బారికేడ్లతో కవర్లు, టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద నీళ్ళలోకి దిగకుండా బారికేడ్ల ఏర్పాటు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు, ప్రమాదాల నివారణకు లైఫ్ బోట్లతో గజ ఈతగాళ్ల ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి సబ్ డివిజన్ల వారీగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఉత్సవ కమిటీ, మండప నిర్వాహకులు పోలీసులతో సహకరించి శాంతియుత నిమజ్జనానికి సహకరించాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.
పాటించాల్సిన సూచనలు..
డీజేలకు అనుమతి లేదు. వాహనాల్లో ఆయుధాలు, మందుగుండు, టపాసులు తీసుకువెళ్లవద్దు. డ్రైవర్ల పూర్తి వివరాలు పోలీసులకు తెలియజేయాలి. నిమజ్జన వేడుకల్లో పాల్గొనే వారు మద్యం, మత్తు పదార్థాలు సేవించరాదు. వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మరాదు. అత్యవసర సమయంలో వందకు డయల్ చేయాలని ఎస్పీ రూపేష్ తెలిపారు.