బస్తర్లో ఎన్‌కౌంటర్ ఆరుగురు మావోలు మృతి
వివరాలు వెల్లడించిన ఐజీ సుందర్‌రాజ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సందర్భంగా కాల్పులు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మృతదేహాల స్వాధీనం
బీజాపుర్: చత్తీస్గఢ్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఆరుగురు నక్సల్స్ మృతిచెందగా, ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్కౌంటర్కు సంబంధించి బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ బుధవారం వివరాలను వెల్లడించారు. లోక్సభ2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్ బలగాలు సంయుక్తంగా యాంటీనక్సల్స్ ఆపరేషన్ను చేపట్టాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున చికుర్బత్తి పుస్బాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ దాగి ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. సమాచారాన్ని విశ్లేషించుకున్న అనంతరం బలగాలకు సమాచారం అందించామని తెలిపారు. నక్సల్స్ కోసం వెతుకులాట కొనసాగిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని ఐజీ తెలిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్ మృతిచెందారని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతి చెందిన వారిలో ఓ నక్సల్ డిప్యూటీ కమాండర్ ఉన్నట్లు సమాచారం.
హోలీ రోజున బాసగూడ పుస్బాకలో ముగ్గురు గ్రామస్తులను నక్సల్స్ గొడ్డలితో నరికి చంపారు. అప్పటి నుంచి భద్రతా బలగాలు అప్రమత్తమై యాంటినక్సల్స్ ఆపరేషన్ వ్యూహాన్ని ఈ ప్రాంతంలో అమలు చేసి వెతుకులాట ప్రారంభించాయి.
పరిస్థితి చేయి దాటడంతో మావోయిస్టులు చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ఫ్ చర్చలకు సిద్ధమంటూ లేఖ కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ నెల 30న బీజాపూర్ జిల్లా బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. వేసవి కాలం కావడంతో భద్రతా బలగాలకు అనుకూలంగా కూంబింగ్ మారింది. ఆపరేషన్ అబూజ్‌మడ్ టార్గెట్‌గా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం మావోల కంచుకోటలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఓ వైపు భద్రతా బలగాలు, మరోవైపు నక్సల్స్ మధ్య స్థానికంగా ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.