హరహర మహాదేవ్​ ఘనంగా దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అన్ని శైవక్షేత్రాలు, 12 జ్యోతిర్లింగాలలో గురువారం అర్థరాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది.

Mar 8, 2024 - 16:33
 0
హరహర మహాదేవ్​ ఘనంగా దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్: దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అన్ని శైవక్షేత్రాలు,  12 జ్యోతిర్లింగాలలో గురువారం అర్థరాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ ప్రాంగణాలన్నీ హరహర మహాదేవ నామ స్మరణతో మారుమ్రోగిపోయాయి.

 రామనాథస్వామి లింగం - రామేశ్వరం, శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం, భీమశంకర లింగం - భీమా శంకరం, ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం  ఎల్లోరా గుహలు, త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్), సోమనాథ లింగం - సోమనాథ్, నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక), ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం, మహాకాళ లింగం -ఉజ్జయినీ, వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్), విశ్వేశ్వర లింగం - వారణాశి, కేదార్‌నాథ్‌ ఆలయాలను ఆలయ ట్రస్టులు అందంగా అలంకరించాయి. ఆలయ ప్రాంగణాలన్నీ శివన్నామస్మరణతో మారుమ్రోగిపోయాయి. 

ఉజ్జయినిలో రాత్రి 2.30 గంటలకే మహాశివుడు మహాకాల్​ ఆలయాల తలుపులను తెరిచి దర్శనానికి అనుమతించారు. ఇక్కడ శివున్ని బాబా మహాకాళ్​గా కొలుచుకుంటారు. 44 గంటల్లో శివుడి దర్శనానికి 12 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఉజ్జయినీ మహాకాళేశ్వరున్ని ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. ఇందులో ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఉన్నారు. 

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఉన్న ఓంకారేశ్వర్ శివలింగం గర్భగుడి వెలుపల నుంచి కనిపిస్తుంది. సెహోర్‌లోని కుబేరేశ్వర్‌ ధామ్‌లోనూ భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల వరకు 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు స్పష్టం చేశారు. 
వారణాసి విశ్వనాథ ఆలయంలో తెల్లవారుజామున 3.00 నుంచే దర్శనం కొనసాగించారు. ఆలయం వెలుపల భారీ సంఖ్యలో భక్తులు క్యూలో నిలుచున్నారు. 24 గంటల్లో కాశీ విశ్వేశ్వరనాథున్ని పది లక్షల మంది వరకు భక్తులు సందర్శించుకునే అవకాశం ఉన్నట్లు దేవాలయ కమిటీ స్పష్టం చేసింది. 

ఝార్ఖండ్​లోని బాబా బైద్యనాథ్​ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. 24 గంటల్లో 1.5 లక్షల మంది భక్తులు సందర్శించుకునే అవకాశం ఉన్నట్లు ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఆలయం బయట ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్​ ఉండడం విశేషం. 
మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌ ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. భక్తుల రాకను ముందే అంచనా వేసిన ఆలయ వర్గాలు, నేపాల్​ ప్రభుత్వం గతం కంటే పటిష్టంగా భద్రత, మౌలిక సదుపాయాల కల్పనను ఏర్పాటు చేసింది. పశుపతినాథ్​ ఆలయం విద్యుత్​ కాంతులీనుతోంది. 

హిమాచల్​ప్రదేశ్​లో చిన్న కాశీ శైవ క్షేత్రంలో శనివారం నుంచే శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల  సందర్భంగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత మంది భక్తుల తాకిడి పెరిగింది. 
మహాశివరాత్రి సందర్భంగా దేశంలోనే తొలి జ్యోతిర్లింగ సోమనాథ్ ఆలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. హర-హర మహాదేవ్ ప్రతిధ్వనితో శివ భక్తులు మహాదేవుని దర్శనం కోసం బారులు తీరారు. ఆలయంలో శివుడికి మహామృత్యుంజయ యాగంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.