పిల్లిని కాపాడబోయి ఐదుగురి దుర్మరణం

బావిలో బయోగ్యాస్​ తో మృతి ఒకరిని కాపాడిన పోలీసులు

Apr 10, 2024 - 15:56
 0
పిల్లిని కాపాడబోయి ఐదుగురి దుర్మరణం

ముంబై: బావిలో పడ్డ పిల్లిని కాపాడాలనే ఉద్దేశంతో బావిలోకి దిగిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన మహారాష్​ర్టలోని అహ్మద్​ నగర్​ వాడ్కి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న నెవాసా పోలీసు సీనియర్​ అధికారి ధనంజయ్​ జాదవ్​ తన టీమ్​ తో కలిసి ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అనంతరం మీడియాకు జాదవ్​ వివరాలను వెల్లడించారు. బావిలో పిల్లి పడిపోయిందని దాన్ని కాపాడేందుకు ఒక్కరొక్కరుగా ఐదుగురు బావిలోకి దిగారని పోలీసులు తెలిపారు. బావిలో బయోగ్యాస్​ వెలువడుతున్న విషయాన్ని గుర్తించలేక పోయారన్నారు. దీంతో ఐదుగురు మృతిచెందారని తెలిపారు. ఈ బావి జంతువ్యర్థాలతో నిల్వ చేసినట్లు గుర్తించామన్నారు. ఆరుగురు బావిలోకి దిగగా ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. రెస్క్యూ సిబ్బంది మాణిక్​ కాలే అనే వ్యక్తిని కాపాడినట్లు వివరించారు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడన్నారు.