ఢిల్లీ మెట్రోపై విద్రోహ కోణం?
సిగ్నలింగ్ కేబుల్ ధ్వంసం
పలు సేవలకు అంతరాయం
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
విచారణ చేపట్టామన్న అధికారులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లపై విధ్వంసాలు, దాడుల తరువాత ఢిల్లీ మెట్రోపై భారీ కుట్ర కోణం జరుగుతోందా? ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ మెట్రో సిగ్నలింగ్ వ్యవస్థను దెబ్బతీసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయా? అంటే అవుననే అనిపిస్తుంది. ఢిల్లీ మెట్రో హైదర్ పూర్ బద్లీ – జహంగీర్ పురి స్టేషన్ ల మధ్య ఉన్న సిగ్నలింగ్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో అనేక మెట్రో సేవలపై ప్రభావం పడింది. రద్దీ సమయంలో కేబుల్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సిగ్నలింగ్ కేబుల్ వ్యవస్థను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం నిజమేనని మెట్రో రైల్ అధికారులు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నామన్నారు. సమాచారం అందిన వెంటనే కేబుల్ వ్యవస్థను సరిచేసి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ లోపు మెట్రో లైన్ సేవలను అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అయితే ఇది ఆకతాయిలు చేసిన పనా? సంఘ విద్రోహ శక్తుల పనా? లేక ఉగ్రకోణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. డీఎంఆర్సీ అధికారులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.