సందేశ్ ఖాలీ కేసు
సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం సహకరించాలన్న కోర్టు 15 రోజుల్లోగా సీసీటీవీలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు మహిళా సంఘాల హర్షం
కలకత్తా: సందేశ్ ఖాళీ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం హైకోర్టులో కేసు విచారణకొచ్చింది. సీబీఐకి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితులు నేరుగా సీబీఐతో అన్ని వివరాలు పంచుకోవచ్చని స్పష్టం చేసింది. టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ భూకజ్జా, అత్యాచారం, వ్యవసాయ భూముల కబ్జాల వంటి ఫిర్యాదులపై సీబీఐ విచారణ జరుపుతోంది. విచారణ కోర్టు పరిధిలో జరుగుతుందన్న విషయాన్నిస్పష్టం చేసింది. సందేశ్ ఖాలీ ప్రాంతంలో 15 రోజుల్లోగా ప్రభుత్వం సీసీటీవీలను అమర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రహదారులపై లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. సాక్ష్యాలను భద్రంగా ఉంచాలని తెలిపింది. మే 2న ఈ కేసుపై మరోమారు విచారణ జరపనున్నట్లు హైకోర్టు పేర్కొంది. అదే రోజున విచారణ అంశాలతో కోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించనుంది.
సందేశ్ ఖాలీ కేసులో షేక్ షాజహాన్ తోపాటు శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ నిందితులుగా ఉన్నారు. వీరు ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించారు.
కాగా కోర్టు విచారణ ఆదేశాలపై పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీఎంసీ ప్రభుత్వం ఇక దర్యాప్తును ఆపే ప్రయత్నం చేయలేదని సంతోషం వ్యక్తం చేశారు. టీఎంసీ అరాచకాలకు హైకోర్టు జోక్యంతో తెరదిగనుందని సంతోషం వ్యక్తమవుతోంది.