దాడిపై స్పందించరా? సీఎం మౌనం వీడకపోవడం సిగ్గుచేటు

బీజేపీ నేత బన్సూరి స్వరాజ్​

May 17, 2024 - 18:35
 0
దాడిపై స్పందించరా? సీఎం మౌనం వీడకపోవడం సిగ్గుచేటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాలివాల్​ పై దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఆ పార్టీ అధినేత మౌనం వీడకపోవడం సిగ్గుచేటని బన్సూరి స్వరాజ్​ మండిపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికే తాను తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం దురహంకారం వల్ల నిరుపేదలకు ఆయుష్మాన్​ భవ లాంటి పథకాలు అమలు చేయలేదన్నారు. ప్రతీ పౌరుడికి ఆపద సమయంలో కేంద్రం రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తే సీఎం కేజ్రీవాల్​ ఆ పథకానికి తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. ఈ విషయంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని బన్సూరి పేర్కొన్నారు.

స్వాతిమాలివాల్​ పై దాడి ఖండించదగినదన్నారు. ఈ ఘటనపై ఇప్పటికీ సీఎం స్పందించకపోవడం విచారకరమని తెలిపారు. నిందితుడిపై చర్య తీసుకునేందుకు ఆప్​ పార్టీ ఎందుకు వెనుకాడుతుందని ప్రశ్నించారు. సొంతపార్టీ మహిళా ఎంపీపై ఇలాంటి చర్యలు దేనికి దారితీస్తాయని ప్రశ్నించారు. ఢిల్లీలో మహిళల భద్రతపై, ఆ పార్టీలో జరిగిన ఘటనపై సాక్షాత్తూ సీఎం స్పందించకుంటే మరింకెవరు స్పందిస్తారని బన్సూరి స్వరాజ్​ నిలదీశారు.