బంధువులే సేవకులు ఇదీ భైంసా ప్రభుత్వాసుపత్రి తీరు

Relatives are servants, this is the way of Bhainsa Govt

Jun 6, 2024 - 16:37
 0
బంధువులే సేవకులు ఇదీ భైంసా ప్రభుత్వాసుపత్రి తీరు

నా తెలంగాణ, నిర్మల్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సౌకర్యాల తీరు. ఓ వైపు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నామని గొప్పలు చెబుతున్నా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులు సిబ్బంది కొరతను పట్టించుకోవడం లేదనే విమర్శలు, ఆరోపణలున్నాయి. రోగులకు సేవ చేయాల్సిన కింది స్థాయి సిబ్బంది కొరత ఉండడంతో రోగి బంధువులే అన్ని పనులు చేసుకుంటూ వైద్యం చేయించుకొని దేవుడా అని ఊపిరి పీల్చుకుంటూ ఆసుపత్రి నుంచి క్షేమంగా బయటకు వెళితే చాలనుకోవడం కొసమెరుపు.

గురువారం భైంసా ప్రభుత్వాసుపత్రిలో రోగిని స్ట్రెచర్ పై తీసుకువెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో రోగి బంధువులు, పిల్లలే  తీసుకువెళ్లడం కనిపించింది. లోకేశ్వరం మండలానికి చెందిన ఒక మహిళ వైద్యం నిమిత్తం ఆరోగ్య శ్రీ వార్డులో చేరి చికిత్స పొందుతోంది. ఆమె గాయానికి డ్రెస్సింగ్ నిమిత్తం మరో గదిలోకి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. సహాయక సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. దీంతో రోగి బంధువుల పిల్లలే రోగిని స్ట్రెచర్ పై పడుకోబెట్టి తరలించారు. పిల్లలకు  స్ట్రెచర్ ను తోయడం తాహతుకు మించిన పనయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.