నిఘా నీడలో ఎర్రకోట
స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లు పూర్తి ప్రత్యేక అతిథులుగా పంచాయతీరాజ్ ప్రతినిధులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆ పరిసర ప్రాంతాలన్నీ నిఘా నీడలోకి వెళ్లిపోయాయి. ఆగస్ట్ 15న ఎర్రకోటకు దారితీసే రహాదారులన్నింటిపై ఆంక్షలు కొనసాగనున్నాయి. దేశ స్వాతంత్ర్య వేడుకలు, మువ్వన్నెల పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న నేపథ్యంలో భారీ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆకాశ, భూతల, జల సేనలు కూడా భద్రతా విధుల్లో నిమగ్నమయ్యాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాలలో ఇప్పటికే బాంబుస్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలను చేపట్టి ఆ ప్రాంతానంతా ప్రత్యేక భద్రత దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ మార్గంలో బస్సులు, రైళ్లు ప్రయాణించడంపై నిషేధం విధించారు.
78వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పంచాయతీ ప్రతినిధులు హాజరు కానున్నారు. వేడుకల్లో హాజరయ్యేందుకు పంచాయతీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానాలు పంపారు.
ఈ వేడుకలకు 400 మంది పంచాయతీ రాజ్ సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులను వారి జీవిత భాగస్వాములతో హాజరుకానున్నారు. అట్టడుగు వర్గాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈసారి స్వాంతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది.