ఋణమాఫీపై చర్చకు సిద్ధమా?

పీఎం లేఖలో వాస్తవాలు కప్పిపుచ్చుతారా? బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి

Oct 7, 2024 - 18:31
Oct 7, 2024 - 18:33
 0
ఋణమాఫీపై చర్చకు సిద్ధమా?
నా తెలంగాణ, నిర్మల్: తెలంగాణలో రుణమాఫీ జరిగిందని అవాస్తవాలతో ప్రధానికి లేఖ రాసిన సిఎం రేవంత్ రెడ్డి ఋణమాఫీ పూర్తిగా జరిగిందన్న విషయంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడు, ఎక్కడ చర్చ జరిపినా తాను సిద్ధమేనని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ సోమవారం  విడుదల చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే 2023 డిసెంబర్ 09న రైతులందరికీ రూ.2 లక్షల వ‌ర‌కున్న పంట ఋణాల‌ను మాఫీ చేస్తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చింది వాస్తవంకాదా? అని ప్రశ్నించారు.  ఆరు నెల‌లైనా ఋణ‌మాఫీ హామీ అమ‌లు కాకపోవ‌డంతో, రైతుల్లో ఆగ్రహాన్ని గ్రహించి లోక్ సభ ఎన్నికల సమయంలో ఆగస్టు 15 క‌ల్లా రైతులందరికీ రూ.2లక్షల వరకు ఋణమాఫీ చేస్తామంటూ ఒట్టుపెట్టి మరీ హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఋణాలు మాఫీ కాని అంశాన్ని ప్రధాని ప్రస్తావించారని అన్నారు. అయితే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందన్న భయంతో అబద్ధాలను రంగరించి సీఎం లేఖ రాయటం ప్రజలను మోసం చేయ‌డం కాదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు రూ.2 ల‌క్షల్లోపు ఉన్న పంట‌ఋణాల‌ను ఒకే ద‌ఫాలో అమ‌లు చేస్తామ‌న్నారని, స‌గం మంది రైతుల‌కు కూడా ఋణాలు మాఫీ కాని మాట వాస్తవం కాదా? అన్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రూ49,500 కోట్లు అవసరం అవుతాయని ప్రకటించి, రాష్ట్ర బడ్జెట్లో రుణ‌మాఫీ ప‌థకానికి రూ.26 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 
 
కేవ‌లం 22,22,000 రైతుల‌కు రూ.17,869 కోట్లు మాత్రమే మాఫీ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని త‌గ్గించుకునేందుకు, కుటుంబ నిర్ధారణ చేసే పలు అంశాలను ముందుకు తెచ్చి సాంకేతిక కార‌ణాల‌తో లక్షలాది రైతుల‌కు రాష్ట్ర స‌ర్కారు రుణ‌మాఫీ ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని దుయ్యబట్టారు. ఋణ‌మాఫీ జ‌ర‌గాల్సిన రైతులు లక్షల సంఖ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ప‌ట్ల ఆగ్రహంగా ఉన్నార‌ని ఇంటిలిజెన్స్​ నివేదికతో వ‌రంగ‌ల్ లో కాంగ్రెస్ నిర్వహించ త‌ల‌పెట్టిన కృత‌జ్ఞతా స‌భ రద్దు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋణ‌మాఫీ అంశంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని బీజేపీ గ‌త 50 రోజుల డిమాండ్ ను  ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప్రజాప్రతినిధులు  30న 24 గంట‌ల‌పాటు నిరాహార దీక్ష చేశారన్నారు. అయినా రాష్ట్ర స‌ర్కారు స్పందించి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌క‌పోవ‌డం బాధ్యతరాహిత్యమని తెలిపారు. తన ప్రశ్నలపై చర్చకు ఎప్పుడు ఎక్కడకు రమ్మన్నా తాను సిద్ధమని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ


నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 162 మంది లబ్ధిదారులకు రూ.41.58 లక్షల చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.