ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదిక

టీ వీ వీ పీ కమిషనర్ అజయ్ కుమార్

Oct 7, 2024 - 18:21
 0
ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదిక

నా తెలంగాణ, నిర్మల్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో సోమవారం ఆయన జిల్లా ప్రధానాసుపత్రితో పాటు పలు పీహెచ్ సిలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల అధిపతులతో మాట్లాడి వివరాలు సేకరించామని అన్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, మంజూరైన సిబ్బంది, ఖాళీగా ఉన్న పోస్టుల వంటి వివరాలను సేకరించామన్నారు. మందుల కొరత ఉందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, సరిపడా మందులు ఉన్నాయని అన్నారు. అవసరం అయితే కొనుగోలు చేసేందుకు నిధులు ఉన్నాయని తెలిపారు. వివిధ విభాగాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. ఇంజనీరింగ్ విభాగం, వైద్య శాఖ సమన్వయంతో ఇది సాధ్యపడిందని అన్నారు. పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించి అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస కుమార్, ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్ తదితరులున్నారు.