సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ, జెఎంఎం కూటమి పార్టీలు
సంక్షేమ పథకాలపైనే హేమంత్ ఆశలు
వినూత్న ప్రచారానికి తెరతీస్తున్న బీజేపీ
ఆదివాసీ, గిరిజన, నిమ్నవర్గాల్లో నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఝార్ఖండ్ లో హోరాహోరీ పోరుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపిక గెలుపుతో తమ పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన రాష్ట్రం ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సై అంటే సై అంటున్నాయి. ఓ వైపు అధికార జెఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గెలుపునకు తీవ్రంగానే కృషి చేస్తుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూటమి పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నా సొంతంగానే గెలుపు సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా మారింది.
హేమంత్ సోరెన్..
రాష్ర్టంలోని ప్రకటించిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాలో హేమంత్ ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ హరియాణాలో ఘోర ఓటమితో కాసింత కలత చెందుతోంది. ఝార్ఖండ్ లో కూటమి ప్రచారానికి హేమంత్ సోరెన్ కు ఇదొక అడ్డంకిగా మారింది. అదే సమయంలో తన అవినీతి, జైలు జీవితం, ఆరోపణలు కూడా ఈసారి హేమంత్ కు అధికారం కట్టబెట్టడం కూడా అనుమానమే అనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ..
అదే సమయంలో బీజేపీ మోదీ నేతృత్వంలో ప్రచార శైలిలో దూసుకుపోతుంది. కేంద్రమంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మలు బీజేపీ కృషికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో సొంతంగానే 31.8 శాతం ఓట్లతో 37 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగింది. 2019లో ఓటింగ్ శాతం 33.8 శాతానికి పెంచుకున్నా సీట్లలో కాస్త వెనుకబడింది. 25 స్థానాలను సాధించింది. మోదీ నేతృత్వంలో ఝార్ఖండ్ లో మరింత బలం పెంచుకుంది. ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతకల్పిస్తూ ఆ వర్గానికి చెందిన చంపై సోరెన్ ను పార్టీలోకి తీసుకోవడంతో 15 స్థానాలపై పట్టు సాధించినట్లయింది. అయితే ఈసారి బీజేపీ ఇక్కడ 61 స్థానాల్లో పోటీ చేస్తుండగా దాని మిత్ర పక్షాలు మిగతా స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సొంతంగానే 81 స్థానాల్లో 41ఆధిక్య స్థానాలను గెలుచుకోవాలని పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
బీజేపీ ప్రచారాస్త్రాలు..
- బంగ్లాదేశ్ నుంచి ఝార్ఖండ్ లోకి అక్రమ చొరబట్లు, స్థానికులకు అవకాశం సన్నగిల్లడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
- సీఎం హేమంత్ తోపాటు జేఎంఎం, కాంగ్రెస్ నాయకుల అవినీతిని బట్టబయలు చేస్తుంది. వారిపై ఈడీ దాడులు, లభించిన నోట్ల కట్టలను ఆధారాలుగా మలచుకొని ప్రచారంలో ఉపు కొనసాగిస్తుంది.
- రాష్ర్టంలో శాంతిభద్రత క్షీణత, మహిళా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివాసీ, గిరిజనులు, నిమ్న వర్గాలను ఆకట్టుకుంటోంది.
- మోదీ (కేంద్ర ప్రభుత్వం) రాష్ర్టంలో చేపడుతున్న, చేపట్టిన ప్రాజెక్టులను వివరిస్తూ డబుల్ ఇంజన్ అభివృద్ధి ప్రచారంలో ప్రచారంలో దూసుకువెళుతోంది.
ఝార్ఖండ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మొత్తం స్థానాలు81
పార్టీ సీట్లు ఓట్లశాతం
బీజేపీ 25 34
జేఎంఎం 30 19
కాంగ్రెస్ 16 14
ఇతరులు 10 33