అమిత్ షాతో ఎన్ఎల్ఎఫ్టీ, ఏటీటీఎఫ్ ల భేటీ
30యేళ్ల సుధీర్ఘ పోరాటానికి తెర
మోదీ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసాలే శాంతికి కారణం
సీఎం మాణిక్ సాహు ధన్యవాదాలు
అగర్తల: ఎట్టకేలకు త్రిపుర శాంతి ఒప్పందం ఆమోదించారు. కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలోని నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్ ఎల్ ఎఫ్ టీ), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ఏటీటీఎఫ్) ప్రతినిధులు భేటీ అయి శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో 30యేళ్ల సుధీర్ఘ సాయుధ పోరాటానికి ఇరువురు ముగింపు పలికినట్లయ్యింది. ఇరు సంస్థలు కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
శాంతి ఒప్పందం కుదరడంతో త్రిపుర సీఎం మాణిక్ సాహా షాకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ర్టం ఇక పూర్తి అభివృద్ధి దిశలో సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల ఎదుగుదలకు కేంద్రం, రాష్ర్టం చర్యలు తీసుకుంటాయని తెలిపారు.
బుధవారం షాతో జరిగిన ఒప్పందాల ప్రకారం.. 328 మంది ప్రధాన జన జీవన స్రవంతిలోకి రానున్నారు. వీరి కోసం ఉద్యోగ ఉపాధి మార్గాలు, నివాసాలపై ప్యాకేజీని ప్రకటించారు. ఆదివాసీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అమిత్ షా సమావేశంలోని పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. త్రిపురలోని మీమీ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం, రాష్ర్టం వారి హక్కుల సాధన, ఆశయ సాధనలో కృషి చేస్తాయన్నారు. చరిత్ర, భూమి, నివాసం, గుర్తింపు, సంస్కృతి, భాష తదితర సమస్యలన్నింటినీ సామరస్య పూర్వకంగా అందరం కలిసి పరిష్కార మార్గాలను వెతకాల్సి ఉందన్నారు. రాష్ర్ట ప్రజల హక్కులను కల్పించేందుకు తాను రెండు అడుగులు ముందుంటానని షా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కోరుకున్న విధానాలను కూడా వారికి స్పష్టంగా వివరించారు. హింస, ఉగ్రవాదం, ఘర్షణలు లేని త్రిపురను నిర్మించాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈశాన్య ప్రాంతంలో త్రిపుర దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఇందుకోసం కేంద్రం తమ వంతు సహాయ, సహకారాలను అందజేస్తుందని అమిత్ షా తెలిపారు. కాగా ఈశాన్య ప్రాంతాల్లో ఒప్పందాల వల్ల సుమారుగా 10వేల మంది హింసామార్గాన్ని విడనాడీ ప్రజాక్షేత్రంలో నడవాలని నిర్ణయించుకోవడం గమనార్హం.